Published : 14/01/2021 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విదేశీ అతిథులం.. వచ్చేశాం..!!

వేల కిలోమీటర్లు ప్రయాణించి.. నాలుగైదు నెలల పాటు ఇక్కడే ఉంటూ పక్షి ప్రేమికులకు అమితానందాన్ని కలిగించే సైబీరియన్‌(ఎర్రమూతి) కొంగలు మహబూబాబాద్‌ జిల్లాకు వచ్చేశాయ్‌.. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్‌ మండలం మాధవాపురానికి జనవరి 4వ తేదీన ఈ విదేశీ అతిథులు విచ్చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని కొంగలే రాగా.. మరికొద్ది రోజుల్లోనే ఈ సంఖ్య బాగా పెరుగుతుందని వారు చెబుతున్నారు. విస్తారంగా చెట్లు, నీటి వనరులున్న ఈ ప్రాంతంలో గూళ్లు కట్టుకుని గుడ్లు పెట్టి అవి పిల్లలుగా మారి వాటికి ఎగిరే శక్తి రాగానే వర్షాకాలం ప్రారంభంలో తిరిగి సైబీరియాకు వెళ్లిపోతుంటాయి. సంక్రాంతితో పల్లెకు ఇప్పటికే కొత్త కళ రాగా రంగురంగుల కొంగలు చేస్తున్న ధ్వనులు, చెరువులో అటు ఇటూ తిరుగాడుతుండడంతో ఆహ్లాదకర వాతావరణంతో మరింత సందడి నెలకొంది. వచ్చి పోయే వారు ఈ కొంగలను ఎంతో ఆసక్తిగా చూస్తూ తమ చరవాణుల్లో బంధించుకుంటున్నారు. గతంలో వేసవి కాలంలో నీటి వనరులు అడుగంటిపోవడంతో ఈ కొంగలకు తాగునీరు, ఆహారానికి ఇబ్బంది పడేవి. ఈ సారి విస్తారంగా వర్షాలు కురవడంతో జలకళ ఉట్టిపడుతోంది. చెరువుల్లో చేపలు ఉండటంతో ఆహారం కొరత తప్పినట్లేనని గ్రామస్థులు చెబుతున్నారు.

 

- ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌ రూరల్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని