
భక్తిశ్రద్ధలలో బడాపహాడ్ ఉర్సు ఉత్సవాలు
వర్ని: మత సామరస్యానికి ప్రతికగా పేరుగాంచిన ఉత్తర తెలంగాణ బడాపహాడ్ సయ్యద్ హజరత్ షాదుల్లా బాబా ఉర్సు ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో బడాపహాడ్కు తరలివచ్చారు. ఆనవాయితీ ప్రకారం జలాల్పూర్ గ్రామం నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, వక్ఫ్ బోర్టు అధికారులు గంధాలు, నూతన వస్త్రాలు, పూజసామగ్రిని దర్గాకు తీసుకెళ్లారు. తొలుత స్థానిక గ్రామ చావిడిలో మహారాష్ట్ర, కర్ణాటక కళకారులు కవ్వాళి నిర్వహించారు. అనంతరం అశ్వం, ఒంటె మీద ఊరేగింపుగా పూజ సామగ్రిని తీసుకెళ్లారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు స్థానిక రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బుధవారం అన్నదానం, కవ్వాలి కార్యక్రమాలు కొనసాగుతాయని వక్ఫ్ బోర్టు అధికారులు తెలిపారు.