పచ్చందాలు పూసేలా.. గిరులు మురిసేలా
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

పచ్చందాలు పూసేలా.. గిరులు మురిసేలా

విత్తన బంతులతో కొండ ప్రాంతాలు సస్యశ్యామలం

కార్యాచరణ చేపట్టిన అధికారులు

ఉపాధి కూలీలతో తయారవుతున్న విత్తన బంతులు

ఏటా తరిగిపోతున్న అటవీ విస్తీర్ణం.. భూతాపాన్ని పెంచుతోంది. ప్రకృతి విపత్తులను తెచ్చి పెడుతోంది. కుదిరితే అతివృష్టి.. లేదంటే అనావృష్టితో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జిల్లాలో గతంలో దండిగా అడవులు విస్తరించి ఉండగా.. స్మగ్లర్లు, సమీప గ్రామాల ప్రజల దెబ్బకు ఏటికేడు తగ్గిపోతోంది. సంరక్షణ కరవై తరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చి పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. వృక్ష సంపద కనుమరుగైన ప్రదేశాల్లో విత్తన బంతులు విసిరేందుకు కార్యాచరణ చేపట్టారు. మళ్లీ పచ్చందాలు పూయించేందుకు కృషి చేస్తున్నారు.

న్యూస్‌టుడే, కావలి : జిల్లా నీటి నిర్వహణా సంస్థ(డ్వామా) ఆధ్వర్యంలో విత్తన బంతుల కార్యక్రమానికి అధికారులు నడుం బిగించారు. నిర్జన ప్రదేశాలుగా ఉండే కొండలు, గుట్టలు, బంజరు భూముల్లో ఈ బంతులను విసురుతారు. జిల్లాలోని నెల్లూరు గ్రామీణ మండలం దేవరపాళెం, పొదలకూరు మండలం ఇంకుర్తి నర్సరీల్లో ఈ విత్తన బంతులను ఉపాధి హామీ పథకంలో భాగంగా తయారుచేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు పని కల్పిస్తూ బంతుల తయారీ అప్పగించారు. వీటిని కొండ ప్రాంతాల్లో విసిరే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎక్కడెక్కడంటే..

విత్తన బంతులను విసరడంలో జిల్లాలోని ఉదయగిరి, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు పెద్దపీట వేస్తున్నారు. మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో అక్కడక్కడా మిట్ట ప్రాంతాల్లో కూడా వీటిని వేయనున్నారు. కావలి నియోజకవర్గ పరిధిలోని రాజువారిచింతలపాళెం, బిట్రగుంట, దగదర్తి, రంగ సముద్రం, తదితర గ్రామాలను ఎంపిక చేశారు.

రెండు సీజన్లు కలిసేలా

ప్రస్తుతం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో విత్తన బంతుల తయారీ కార్యక్రమం ఊపందుకొంది. జిల్లాలో సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో భారీ వర్షాలు కురవడం పరిపాటి. ఆ సందర్భంలో మరో పర్యాయం ఇదే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా పచ్చదనం పరిఢవిల్లేలా కృషి చేస్తున్నారు. వేసవిలో ఎండిన చెట్లు, చేమలు ఇప్పటి వర్షాలకు కొంత ఊరిపి పీల్చుకున్నా.. విత్తనబంతులతో మరింత మార్పు వస్తుందని అధికారులు చెబుతున్నారు.

 

ఎలా చేస్తారంటే..

ఉపాధి కూలీలు తడి మట్టిని ఉండగా చేసి అందులో రెండేసి విత్తనాలు పెడతారు. ఈ బంతులు సగటున సపోటా పండు పరిమాణంలో ఉంటాయి. బంతిని గిరాటు వేసినప్పుడు కొంతదూరం దొర్లుతూ వెళ్లి పడే అవకాశాలుంటాయి. అలాగే ఒకే చోట మట్టిఉండ పడినా నష్టం లేదని భావిస్తున్నారు. మిట్ట భూముల్లోని రాతి నేలపై ఇవి పడి చుట్టూ ఉండే మట్టి పగిలితే రెండు విత్తనాలు వేర్వేరుగా పడతాయి. వర్షాలు పడగానే మట్టిలో నుంచి చిగురులు వేస్తాయి.

4 లక్షల బంతులు సిద్ధం : తిరుపతయ్య, డ్వామా పీడీ, నెల్లూరు

జిల్లాలో ఇప్పటికే నాలుగులక్షల విత్తన బంతులు తయారయ్యాయి. త్వరలోనే ఉపాధి కూలీలతో కొండ ప్రాంతాల్లో వీటిని వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎప్పటికప్పుడు తయారీ ప్రక్రియను పరిశీలిస్తున్నాం. ఈ కార్యక్రమ విజయవంతంతో నల్లరాతి కొండలు సైతం హరితగిరుల్లా మారుతాయి.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని