వేధింపులు తాళలేక.. ఆత్మహత్యాయత్నం
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

వేధింపులు తాళలేక.. ఆత్మహత్యాయత్నం

జిల్లా పోలీసు కార్యాలయం ఎదుటే సంఘటన

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: పొరుగు రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న ఓ వివాహితకు, ఆమె స్నేహితుడికి కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎక్కువవడంతో.. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయం ఎదుటే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన బుధవారం కలకలం రేపింది. దుత్తలూరు మండలం నర్రవాడకు చెందిన యువతికి నాలుగేళ్ల కిందట విజయకుమార్‌తో వివాహమైంది. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో.. మూణ్నెల్లకే పుట్టింటికి చేరారు. ఈ ఏడాది మే నెలలో కొండాపురానికి చెందిన కొండలరావుతో రెండో వివాహం చేశారు. ఈయన బెంగళూరులో పండ్ల రసాల వ్యాపారం చేస్తూ.. అప్పుడప్పుడు ఇంటికొచ్చి వెళ్లేవారు. దంపతుల మధ్య కలహాలు రేగడంతో.. తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ఇంటికొచ్చిన కొండలరావు.. తిరిగి ఈ నెల 21న బెంగళూరు వెళ్లిపోయాడు. మరుసటి రోజే ఆమె తన స్నేహితుడైన మాలకొండారాయుడు సాయంతో కరీంనగర్‌లోని అతని సోదరి ఇంటికి చేరుకెళ్లి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. వివాహిత కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, భర్త గాలించారు. ఎట్టకేలకు కరీంనగర్‌లో ఉంటోందన్న విషయం తెలుసుకొని కొండాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అదృశ్యం కేసు నమోదు చేసి.. విచారణ నిమిత్తం మాలకొండారాయుడును స్టేషన్‌కు పిలిపించారు. అతని ఫోన్‌ ద్వారా వివాహితకు ఫోన్‌ చేయగా.. తాను మేజర్‌నని, భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదని సమాధానమిచ్చారు. అదే విషయం స్టేషన్‌కొచ్చి స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని పోలీసులు సూచించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి నేరుగా నెల్లూరు చేరుకుని.. మద్రాసు బస్టాండు సమీప ఓ మెడికల్‌ దుకాణంలో నిద్రమాత్రలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత వివాహిత, ఆమె స్నేహితుడు ఇద్దరూ మాత్రలు మింగి తల్లిదండ్రుల వేధింపులపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. వారిపై అనుమానం రావడంతో.. పోలీసులు హుటాహుటిన ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ఉదయగిరి సీఐ గిరిబాబు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని