సామర్థ్య పరీక్ష నామమాత్రం
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

సామర్థ్య పరీక్ష నామమాత్రం

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. వారు ఏ పాఠ్యాంశంలో ముందజంలో ఉన్నారు, ఎక్కడ వెనుకంజలో ఉన్నారని తెలుసుకునేందుకు బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇవి ఈనెల 27 నుంచి ప్రారంభమవ్వాల్సి ఉంది. రెండు రోజులు గడిచినా వాటి ఊసే ఎక్కడా కనిపించడం లేదు. బుధవారానికి కూడా ప్రశ్న పత్రాలను సిద్ధం చేసుకునే పనిలో ఉపాధ్యాయులు కనిపించారు.

కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా విద్యా వ్యవస్థలో అవాంతరాలు తప్పలేదు. ఈక్రమంలో ప్రభుత్వం తాజాగా విద్యార్థుల్లోని నైపుణ్యాలు తెలుసుకునేందుకు బేస్‌లైన్‌ టెస్ట్‌ పేరుతో ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. దాంతో డీఈవో ఈ ఉత్తర్వులను జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జారీ చేశారు. ఈ పరీక్షల నిర్వహణలో అంతులేని జాప్యం చోటుచేసుకుంది. పాఠశాల విద్యాశాఖ అందించిన మాదిరి ప్రశ్న పత్రాన్ని పలు పాఠశాలల ఉపాధ్యాయులు బుధవారం సిద్ధం చేసుకున్నారు. కొన్నిచోట్ల అసలు ఈ ప్రక్రియే మొదలు కాలేదు. ఇది నామమాత్రంగా సాగుతోందని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రణాళిక ఇలా..

ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు ఇంటి వద్దనే ఈనెల 31వ తేదీ వరకు బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. తయారు చేసిన పశ్న పత్రాలను తల్లిదండ్రులకు ఇచ్చి పిల్లలతో పరీక్ష రాయించేలా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను పాఠశాలలకు రప్పించకూడదు.. ఇంటి వద్దనే రాయించాలి. జవాబు పత్రాలను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సేకరించి ఆగస్టు 3వ తేదీలోగా ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేపట్టి ఫలితాల సూచనలు విద్యార్థుల వాట్సాప్‌కు పంపాలి. మార్కులను ఆగస్టు 4 నుంచి 10వ తేదీలోగా సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని