మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు 
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు 

బోటులో ప్రయాణిస్తూ వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

జువ్వలదిన్నె (బిట్రగుంట), న్యూస్‌టుడే : ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుతో సముద్రంలో వేట సాగించే మత్స్యకార్ల జీవితాల్లో వెలుగులు వస్తాయని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు అన్నారు. బుధవారం ఆయన బోగోలు మండలం జువ్వలదిన్నెలో సముద్రం ముఖద్వారం వద్దకు బోటులో చేరుకొని ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 78 ఎకరాల్లో రూ.300కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పడబోతుందన్నారు. 1,250 బోట్లు ఒడ్డున నిలిచే విధంగా సౌకర్యాల కల్పన జరుగుతుందన్నారు. బోగోలు మండలంలోని 50వేల మంది జనాభా దప్పిక తీర్చేందుకు వివిధ దశల్లో ఆగిన సీపీడబ్ల్యూఎస్‌, వైఎస్‌ఆర్‌ స్వజలధార పథకాలు పూర్తిచేయిస్తామన్నారు. అనంతరం ఆయన మండలంలోని జువ్వలదిన్నె, ఎస్వీపాళెం గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగులతో మాట్లాడి పనితీరుపై ఆరా తీశారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలన్నారు. 1010 వరి రకం వేయకుండా రైతుల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమం వ్యవసాయశాఖ చేపడుతుందన్నారు. ఆర్డీవో శీనానాయక్‌, జిల్లా మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, తహసీల్దారు బాలమురళీకృష్ణ, ఎంపీడీవో నాసరరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కాలుష్య నియంత్రణకు చర్యలు

నెల్లూరు(కలెక్టరేట్‌): నగరంలో కాలుష్య నియంత్రణకు ముమ్మర చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాలుష్య అధికంగా ఉన్న 124 నగరాల్లో నెల్లూరూ ఉందని, దీన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. చెత్త సేకరణ, దోమల నివారణ, జంతువుల వ్యర్థాల తొలగింపు, మురుగు కాలువల పరిశుభ్రత తదితరాలను ముమ్మరం చేయాలన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని