భూ పంపిణీకి వీలు.. పేదలకు మేలు
eenadu telugu news
Published : 29/07/2021 03:29 IST

భూ పంపిణీకి వీలు.. పేదలకు మేలు

● అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు

● భూ సమస్యలకూ పరిష్కారం

గూడూరు సమీపంలో బీడుగా..

న్యూస్‌టుడే, గూడూరు : పేదల అపరిష్కృత భూ సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ స్థాయి అసైన్‌మెంట్‌ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్‌ రాష్ట్రస్థాయి కమిటీల సమావేశం నిర్వహించారు. దీనిలో పలువురు ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో రద్దయిన కమిటీలను కొత్త రూపంలో తీసుకురానున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు శాసనసభ్యులు అధ్యక్షులుగా నియోజకవర్గ స్థాయిలో అసైన్‌మెంట్‌ కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. వీటి ద్వారా నిరుపేదలకు బంజరు భూములు పంపిణీ చేసేందుకు ఆస్కారం కలగనుంది. జిల్లాలో భూ పంపిణీ కింద ఇప్పటివరకు 24,877 హెక్టార్లను 48,066 మందికి పంపిణీ చేశారు. ఆత్మకూరు, కావలి డివిజన్‌లో అత్యధికంగా భూముల పంపిణీ చేపట్టారు. 2005 నుంచి అయిదు విడతలుగా భూపంపిణీని చేపట్టారు. ఆ తర్వాత 2012లో అసైన్‌మెంట్‌ కమిటీలు రద్దయ్యాయి. తిరిగి 2015లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయిలో ఏర్పాటుచేశారు. తాజాగా నియోజకవర్గ స్థాయిలో మళ్లీ ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు.

భూమి లేని నిరుపేదలకు 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూములు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొందరికి 33 ఏళ్లు, 99 ఏళ్లు లీజుకు భూములు ఇచ్చే ఆస్కారముంది. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే ప్రక్రియ పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసింది. వచ్చే రెండేళ్లలో ప్రక్రియ పూర్తి చేయనుంది. కొందరికి భూములు ఉన్నా వాటికి హద్దుల్లేకపోవడంతో భూములు చూపలేకున్నారు. హద్దులు ఏర్పాటైతే ఆ భూములను వారికే ఇవ్వనున్నారు. వీటన్నింటికి అసైన్‌మెంట్‌ కమిటీల ద్వారా అనుమతులు తీసుకొని పట్టాలు ఇవ్వనున్నారు.

అన్యాక్రాంతమైనవి వెనక్కు : సమగ్ర భూ సర్వే తర్వాత పెద్దల గుప్పెట్లోని వేల ఎకరాలకు విముక్తి కలగనుంది. వారి నుంచి తీసుకునే భూములకు హద్దులేర్పాటు చేసి ప్రభుత్వ భూములుగా మార్చి పేదలకు పంపిణీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అసైన్‌మెంట్‌ పట్టాలు ఇవ్వనున్నారు. మెట్ట ప్రాంతాల్లో భూముల ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఓ నాయకుడి చేతుల్లో వేలాది ఎకరాలు ఉన్నాయి. వీటిలో జామాయిల్‌ సాగు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పేదల నుంచి వీటిని అతి తక్కువగా కొనుగోలు చేసి మొక్కల పెంపకం చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా అసైన్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటైతే ఇలాంటి భూములకు విముక్తి కలగనుంది.

అర్హులకు భూ పంపిణీ చేసేందుకు.. - ఓబులేసు, జిల్లా రెవెన్యూ అధికారి, నెల్లూరు

నియోజకవర్గ స్థాయి అసైన్‌మెంట్‌ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. ఇటీవల దీనిపై కసరత్తు జరిగింది. కమిటీల ఏర్పాటుతో పేదలకు భూ పంపిణీ చేసేందుకు వీలు కలుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని