మొద్దు నిద్ర.. దోపిడీకి ఆమోద ముద్ర !
logo
Published : 25/06/2021 04:31 IST

మొద్దు నిద్ర.. దోపిడీకి ఆమోద ముద్ర !

జిల్లాలో యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు


కంటేపల్లి సమీప ప్రభుత్వ భూముల్లో అనధికారిక గ్రావెల్‌ 
తవ్వకాల ప్రాంతంలో టిప్పర్లు, యంత్రాలు (పాత చిత్రం)

ఈనాడు డిజిటల్, నెల్లూరు గ్రావెల్, మట్టి, ఇసుక.. ఏదైనా సరే, అక్రమార్కుల కన్నుపడితే ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. అనుమతులకు మించి కొందరు.. అవి లేకుండానే మరికొందరు ఇష్టారాజ్యంగా తవ్వి తరలిస్తున్నారు. ఈ క్రమంలో కొండలు కరిగిపోతున్నా..చెరువులు గుల్లవుతున్నా పట్టించుకునే వారే ఉండటం లేదు. ప్రభుత్వ, పంచాయతీల సీనరేజీ ఆదాయానికి గండి పడుతుండగా- అడపాదడపా జరిమానాలతో సరిపుచ్చడం సంబంధిత అధికారుల వంతవుతోంది. వారి పర్యవేక్షణ కరవు అవుతోంది. మూడు రోజుల కిందట కంటేపల్లి సమీపంలో వెలుగు చూసిన గ్రావెల్‌ అక్రమ తవ్వకాలే అందుకు నిదర్శనం. 
ఎవరైనా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టాలంటే... భూగర్భ, గనులశాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ సమయంలో మట్టి తవ్వకాలు చేపట్టే ప్రాంతం. ఆ భూమి ఎవరిది? అక్కడ ఎంత మొత్తం తవ్వుతారనే వివరాలు నమోదు చేయాలి. వాటిని పరిశీలించిన అధికారులు.. మైనింగ్‌ చేయాలనుకుంటున్న భూమికి సంబంధితశాఖ నుంచి నిరభ్యంతరపత్రానికి(ఎన్‌వోసీ)కి పంపుతారు. అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మైనింగ్‌ కోసం దరఖాస్తు చేసిన ప్రాంతంలో ఖనిజాల పరిస్థితి? ఎంత మేరకు లభ్యమవుతుంది. తవ్వకాలు చేపడితే కలిగే ఇబ్బందులను పరిశీలించిన తర్వాత.. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే తాత్కాలిక అనుమతి(టీపీ)ని జారీ చేస్తారు. అయిదు వేల క్యూబిక్‌ మీటర్లలోపు అయితే డీడీ, అంతకు మించి అయితే డైరెక్టర్‌ అనుమతులు జారీ చేస్తారు. అందులో నిర్ణీత వ్యవధిలో.. నిర్దేశించిన పరిమాణం మాత్రమే తవ్వకాలు చేపట్టాలని పేర్కొంటారు. ఇక్కడి వరకు బాగానే ఉంటుండగా.. ఆ తర్వాతే కథ మొదలవుతోంది. అనుమతి తీసుకున్న ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారా? ఎంత మేర చేస్తున్నారా? వంటి వాటిని పట్టించుకునే నాథుడే లేరు. తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన సర్వే నంబర్లలో హద్దురాళ్లు పాతడం లేదు. అనుమతి ఒకచోట ఇస్తే.. మరొక చోట తవ్వకాలు చేసి.. తరలిస్తున్న పరిస్థితి జిల్లాలో కొనసాగుతోంది. 
ఖజానాకు గండి
గ్రావెల్‌ తవ్వకాలకు క్యూబిక్‌ మీటరు రూ.45, డీఎంఎఫ్‌ 30 శాతం, మెరిట్‌ కింద 2 శాతం చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. ఇలా చూస్తే మట్టిని తరలించేవారు ఒక క్యూబిక్‌ మీటరుకు రూ.65 రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అక్రమంగా లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. 

అయిదుగురికే అనుమతి.. అయినా
ప్రస్తుతం జిల్లాలో గ్రావెల్‌ తవ్వుకునేందుకు అయిదుగురికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. సంగం, పొదలకూరు, గూడూరు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాత్రమే తాత్కాలిక పర్మిట్లను మైనింగ్‌ శాఖ జారీ చేసింది. కాగా, జిల్లాలోని కావలి గ్రామీణం, బుచ్చిరెడ్డిపాళెం, చిల్లకూరు, సంగం, అల్లూరు, గూడూరు గ్రామీణం తదితర మండలాల్లో అనుమతులు లేకుండానే రాత్రింబవళ్లు లేఅవుట్లకు, ఇటుక  బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు.  ః కావలి గ్రామీణ మండలం చలంచర్ల పంచాయతీ కొత్తపల్లి చెరువులో ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నారు. ఇది వర్షాధార చెరువైనా.. అభివృద్ధి పనులు చేయాలంటూ.. అందులోని నీటిని వదిలేశారు. తాళ్లపాళెం, బొంతరాయి గనుల సమీపంలోనూ తవ్వకాలు జరుగుతున్నాయి.  ః బుచ్చిరెడ్డిపాళెం మండలంలో గ్రావెల్‌ తవ్వకాలు నిత్యకృత్యంగా మారాయి. కనిగిరి జలాశయంతో పాటు సమీప ప్రభుత్వ స్థలాల్లో గ్రావెల్‌ తరలింపు సాగుతోంది.  ః అల్లూరు మండలం నార్త్‌ఆములూరు, సింగంపేట రెవెన్యూ పరిధిలో బోగోలు మండలం తిప్ప సమీపంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ లేఅవుట్ల పేరుతో అక్రమ మార్గంలో బయటకు తరలిస్తున్నారు. 

సిబ్బంది కొరత వేధిస్తోంది..
మైనింగ్‌శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. డీడీ, ఏడీ కార్యాలయాల్లో కలిపి కేవలం తొమ్మిది మంది మాత్రమే పని చేస్తున్నారు. ప్రస్తుతం అనుమతులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే చూస్తున్నాం ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ప్రభుత్వం పూర్తి అధికారాలను సెబ్‌కు అప్పగించింది. జిల్లాలో అక్రమ మైనింగ్‌ జరుగుతున్న విషయం మా కంటే ముందుగా రెవెన్యూ, పోలీసుల దృష్టికి వెళుతుంది. వారికి వాహనాలు ఆపి, అదుపులోకి తీసుకునే అధికారాలు ఉన్నాయి. ఒకవేళ మేము తనిఖీలకు వెళ్లినా సదరు శాఖాధికారులను వెంటబెట్టుకొని వెళ్లాల్సిందే. - ప్రసాద్, మైనింగ్‌ డీడీ

సమన్వయ లోపమే.. శాపం
అక్రమ మైనింగ్‌ను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చడమే ప్రభుత్వ అధికారుల విధి. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అది నెరవేరుతుంది. అనుమతులిచ్చిన ప్రదేశం వదిలి.. పరిధి దాటి తవ్వకాలు చేస్తుంటే గనులశాఖ ఏడీ, సర్వేయర్లు పరిశీలించాలి. కానీ, వీరు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామ, మండల పరిధిలో ఎక్కడైనా తవ్వకాలు జరుగుతుంటే రెవెన్యూ అధికారులకు తెలిసిపోతుంది. అసలు అనుమతి ఉందా? ఉన్న చోటే తవ్వుతున్నారా? వంటి వివరాలు వారి వద్ద ఉంటాయి. అయినా చాలాచోట్ల తమకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు. మట్టి తరలిస్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. కానీ, చాలా సమయాల్లో ఫిర్యాదు వచ్చినా.. కొందరు సంబంధిత శాఖ అధికారులకు చెప్పమని ఉచిత సలహా ఇస్తున్నారన్న అపవాదు ఉంది. ఫలితంగా జిల్లాలో అక్రమ మైనింగ్‌ను నిరోధించడంలోనూ.. సంబంధిత వ్యక్తులకు జరిమానాలు విధించడంలోనూ విఫలమవుతున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని