దారి చూపేవారేరీ..
logo
Published : 25/06/2021 04:31 IST

దారి చూపేవారేరీ..

అటవీ అనుమతులు రాక ఏళ్లుగా అవస్థలు


బాలాయపల్లి మండలం జార్లపాడు రహదారి దుస్థితి

న్యూస్‌టుడే- వెంకటగిరి గ్రామీణం అటవీ పరిధిలోని రహదారులకు అనుమతులు లభించక.. దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొన్న ఇక్కట్లకు దర్పణం ఈ ఉదంతాలు. దీనిపై దృష్టి పెట్టేవారు లేక.. సమస్య నుంచి గట్టెక్కించేవారు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం చదువు, వైద్యం, ఉద్యోగం.. ఇలా వివిధ పనులకు పట్టణాలకు వెళ్లక తప్పని పరిస్థితుల్లో... కనీస రహదారులకూ నోచుకోలేకపోతున్నామన్న ఆవేదన ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. కొన్ని సార్లు నిధులొచ్చీ.. నిర్మాణ దశలో అటవీ అభ్యంతరాలతో వెనక్కు వెళ్లిన ఉదాహరణలూ అనేకం. ఇకనైనా దృష్టి సారించి సమస్య పరిష్కరించాలన్న విజ్ఞప్తి వ్యక్తమవుతోంది. 
అటవీశాఖ పరిధిలో రహదారి నిర్మించడానికి తొలుత ఆయా భూముల విస్తీర్ణాలను గుర్తించాల్సి ఉంది. అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖకు మరోచోట భూములను కేటాయించాల్సి ఉంది. ఈ తంతు పూర్తి చేసి క్లియరెన్స్‌ తేవాల్సి ఉంది. ఈ రకంగా వెంకటగిరి నియోజకవర్గంలో రెండేళ్ల కిందట పలు గ్రామాలకు సంబంధించి సర్వేలు నిర్వహించినా.. అవి పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఈ నియోజకవర్గంలో మొత్తం 40.42 కి.మీ. దూరం అటవీ అడ్డంకులతో రోడ్లకు మోక్షం కలగడం లేదు. ఇందుకు 22.85 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించి.. అటవీశాఖ నుంచి అనుమతులు సాధించాల్సి ఉంది. బాలాయపల్లి మండలం మేల్చూరు నుంచి సీసీ కండ్రిగ, కరిమెనగుంట, జార్లపాడు, మల్లెమాల గ్రామాలున్నాయి. కామకూరు నుంచి గాజులపల్లి మధ్య అయిదు కి.మీ. దూరం అటవీ సమస్యను అధికాలు నివేదికల్లోనే పొందుపరచలేదు. కోనగుంట, వెంకటేశ్వరపురం గ్రామాలకూ ఇదే తరహా అడ్డంకులున్నాయి. డక్కిలి మండలంలో జాతీయ రహదారి నుంచి నాలుగు కి.మీ. దూరంలో ఉన్న వీకేవై సముద్రానికి మధ్యలో అటవీ సమస్యతో రెండు కి.మీ. రహదారి పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. అప్రోచ్‌లో తారురోడ్డుగా అభివృద్ధి చేసినా.. మధ్యలో మట్టి రోడ్డుకే పరిమితమై.. వర్షాలొస్తే గ్రామస్థులకు రవాణా సమస్య తప్పడం లేదు. దందవోలు నుంచి కేబీపల్లి, వెంబులూరు నుంచి డి.వడ్డిపల్లికి మట్టి రోడ్లు.. అదీ పరిమితంగా ఉండగా... దగ్గవోలు పంచాయతీ రేగడపల్లికీ ఇదే దుస్థితి. ఇక సైదాపురం మండలం వేములచేడు నుంచి అన్నంరాజుపల్లికి, మొలకలపూండ్ల కాలనీకి అటవీ అభ్యంతరాలే అడ్డంకి. కలువాయి మండలం కేపీ రోడ్డు నుంచి చింతలపాళెం, రాపూరు మండలం వీరాయపాళెం గ్రామం రోడ్లకు క్లియరెన్స్‌లు లేవన్నది అధికారుల మాట. ఇంకా పలు గ్రామాల రహదారులకు ఇదే రీతిలో మోక్షం కలగడం లేదు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాస్త చొరవ చూపితే కష్టాలు తీరే అవకాశం ఉంది. 

అనుమతులకు ప్రతిపాదనలు
అటవీ భూములను వినియోగించడానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూములను కేటాయించాల్సి ఉంది. సమస్యను జిల్లా అటవీశాఖ అధికారి దృష్టికి తీసుకువెళతా. వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటికే సర్వేల ద్వారా 14 రోడ్లకు సంబంధించి మొత్తం 40 కి.మీ. పైగా అటవీ అభ్యంతరాల వివరాలపై చర్చించాం. తగు చర్యలు తీసుకుని రోడ్ల నిర్మాణానికి అనుమతి తెప్పించే దిశగా చర్యలు తీసుకుంటాం.  
- బాపిరెడ్డి, గూడూరు సబ్‌ కలెక్టర్‌

* బాలాయపల్లి మండలం భైరవరం పంచాయతీ మల్లెమాల గ్రామానికి దశాబ్దాలుగా రహదారి వసతి లేదు. మేల్చూరు నుంచి జయంపు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో 2 కి.మీ. దూరంలోని ఈ గ్రామంలో 600 మంది జనాభా ఉన్నారు. 2 కి.మీ. నిడివిలో 1.6 కి.మీ. అటవీ పరిధి ఉంది. ఈ కారణంగా రెండేళ్ల కిందట తారు రోడ్డుకు నిధులొచ్చినా.. అటవీ అభ్యంతరాలతో రద్దయిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్య ఎవరికీ పట్టకుండా ఉంది. 
* బోగోలు మండలంలోని బిట్రగుంట-  కొండబిట్రగుంట మధ్య రహదారి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. మొత్తం నాలుగున్నర కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రోడ్డులో 800 మీటర్లు అటవీ పరిధిలో ఉంది. ఈ కారణంగా అటవీ పరిధిలో ఉన్న నిడివిలో తారు రోడ్డుకు మోక్షం కలగడం లేదు. కొండబిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతి శనివారం మూడు మండలాల పరిధిలోని భక్తులు వెళుతుంటారు. అయినా దృష్టి పెట్టేవారు లేరు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని