జిల్లా అదనపు ఎస్పీగా వెంకటేశ్వరరావు
logo
Published : 25/06/2021 04:31 IST

జిల్లా అదనపు ఎస్పీగా వెంకటేశ్వరరావు

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: జిల్లా అదనపు ఎస్పీ(క్రైమ్స్‌)గా వెంకటేశ్వరరావును నియమిస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు అదనపు ఎస్పీలు బదిలీ కాగా, వారిలో ఒకరిని జిల్లాకు కేటాయించారు. క్రైమ్‌ ఏఎస్పీగా ఉన్న పి.మనోహర్‌రావు గత ఏడాది సెప్టెంబరులో ఉద్యోగ విరమణ చేశారు. నాటి నుంచి ఈ పోస్టులో ఎవరినీ నియమించలేదు. తాజాగా డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న ఎస్‌.వెంకటేశ్వరరావును నియమించారు. నేడో, రేపో బాధ్యతలు స్వీకరించనున్నారు. 
ఇద్దరు డీఎస్పీల బదిలీ... నియమాకం
జిల్లాలో ఇద్దరు డీఎస్పీలు బదిలీ కాగా.. వారి స్థానాల్లో మరొకరు నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 22 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. అందులో భాగంగా నెల్లూరు ట్రాఫిక్‌ డీఎస్పీగా పనిచేస్తున్న పి.మల్లికార్జునరావు ఒంగోలు ట్రాఫిక్‌కు బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో డీజీపీ కార్యాలయంలో వెయింటింగ్‌లో ఉన్న ఎండీ అబ్దుల్‌ సుబహాన్‌ను నియమించారు. ఈయన గతంలో జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఎస్సైగా, డీసీఆర్‌బీ, చిన్నబజారు పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. నెల్లూరు ఎస్సీ ఎస్టీ సెల్‌-2 డీఎస్పీగా పని చేస్తున్న ఎం.వీరకుమార్‌ శ్రీకాకుళం ఎస్‌బీ డీఎస్పీగా వెళ్లగా... ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న వై.శ్రీనివాసరావు నియమితులయ్యారు. 
డీబీసీఎస్‌సీఎస్‌ ఈడీగా బ్రహ్మానందరెడ్డి
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: అరకు వ్యాలీ గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్‌ (ఓఎస్‌డీ)గా పనిచేస్తున్న వి.బ్రహ్మానందరెడ్డిని నెల్లూరు జిల్లా వెనుకబడిన తరగుతుల సేవా సంఘం (డీబీసీఎస్‌సీఎస్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బ్రహ్మానందరెడ్డి ఈ పోస్టు కోసం ఇదివరకే సంబంధిత శాఖను, మంత్రులను కోరారు. అతని అభ్యర్థను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం డిప్యుటేషన్‌పై పనిచేయడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
10న జాతీయ లోక్‌ అదాలత్‌
నెల్లూరు (లీగల్‌), న్యూస్‌టుడే: న్యాయసేవాధికార సంస్థ పిలుపు మేరకు జులై 10న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్లు సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యదర్శి ఎం.శ్రీనివాసులునాయక్‌ పర్యవేక్షణలో కోవూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, కోట, ఉదయగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేటలో కార్యక్రమం జరుగుతుందన్నారు. రాజీకి ఆమోద యోగ్యమైన అన్ని సివిల్, క్రిమినల్, కుటుంబ వివాదాలు, మోటారు వాహన ప్రమాద కేసులు, బ్యాంకు, ఫైనాన్స్, ఫ్రిలిటికేషన్‌ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కక్షిదారులు, న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని