అలాంటి పనులు చేయను
logo
Published : 25/06/2021 04:31 IST

అలాంటి పనులు చేయను

అఖిలపక్ష సమావేశంలో మంత్రి అనిల్‌


అఖిలపక్ష సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి అనిల్‌

నెల్లూరు(నగరపాలకసంస్థ): ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకిచ్చిన స్థలాల లేఅవుట్లలో గత ఏడాది వరదలకు మోకాటి లోతు నీళ్లొచ్చాయి. దాంతో అక్కడ పేదలకు స్థలాలు ఎలా ఇస్తారని కొందరు మాట్లాడారు. అలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. గుత్తేదారుడు అనుమతి తీసుకుని పనులు పూర్తి చేశారు. సిల్ట్‌, తువ్వ, తవట ఇసుక అని అధికారులు కూడా నిర్ధారించారు. నా నియోజకవర్గంలో పేదలకు ఇచ్చే స్థలాల్లో ఇసుక నింపారు. ఆ పనులు కాంట్రాక్టర్లకు ఇచ్చారే తప్ప నాకు సంబంధించిన విషయం కాదు. కొందరు ఆ ప్రాంతానికి వెళ్లి రూ. వంద కోట్ల దోపిడీ జరిగిందని అనవసరంగా విమర్శిస్తున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇంకెప్పుడూ.. ఇంకెవరూ అలాంటి మాటలు మాట్లాడకూడదన్న ఆలోచనతోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించా’నని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పెన్నానదిలో రూ. వంద కోట్ల విలువైన ఇసుకను తరలించారన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెదేపా, సీపీఎం నుంచి ఎవరూ హాజరుకాలేదు. భాజపా జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ ప్రభాకర్‌, వి.రామరాజు, కాంగ్రెస్‌ నాయకులు ఉడతా వెంకట్రావు, జనసేన నాయకులు సుజయ్‌బాబు, కిషోర్‌ పాల్గొని చర్చించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు పెన్నానదిలో ఇసుక తవ్విన ప్రాంతాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. సమావేశంలో మంత్రి అనిల్‌ మాట్లాడుతూ తాను అందరికీ స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించానని, అదే క్రమంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌కూ చెప్పానని అన్నారు. కొందరు ఇసుక దోపిడీ జరిగిందని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఎంత తవ్వారు. ఎక్కడ ఉందో అందరికీ తెలుసన్నారు. అసలు ఆ ఇసుక నిర్మాణానికి ఉపయోగపడుతుందా అని ప్రశ్నించారు. ఆరోపణలు మానుకుని వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. పదేళ్లుగా నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నానని, మంత్రి అయిన తర్వాత కూడా ఎవరినీ ఏమీ అడగలేదని, ఇసుక, గ్రావెల్‌ దోపిడీ చేసే కక్కుర్తి పనులు చేయనని స్పష్టం చేశారు. అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడితే భయపడిపోతామని అనుకోవడం పొరపాటని అన్నారు. అనిల్‌కుమార్‌ మంచి వాడు అనుకుంటే 2024లో ప్రజలు గెలిపిస్తారని, లేదంటే ఓడిస్తారని ఆయన అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని