ఇంటికి చేరుకునే లోపే..
logo
Published : 25/06/2021 04:31 IST

ఇంటికి చేరుకునే లోపే..

మినగల్లు (బుచ్చిరెడ్డిపాళెం) : బతుకుతెరువుకోసం వెళ్లి.. పనులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటి దారిపట్టి.. ఇక కొన్ని నిమిషాల్లో ఇల్లు చేరుకుంటాడనంగా ఓ వ్యక్తిని మృత్యువు కబళించిన హృదయ విదారకర ఘటన గురువారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మినగల్లుకు చెందిన కూకటి సురేష్‌ (35) జొన్నవాడ సమీపంలోని దొడ్ల పాలడెయిరీలో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూలాగే గురువారం కూడా విధులు ముగించుకొని తన మోటారు సైకిల్‌పై ఇంటికి వచ్చేక్రమంలో సొంత గ్రామానికి చేరుకున్నారు. మినగల్లు గ్రామ శివారుల నుంచి మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్‌ మోటారు సైకిల్‌ను వెనుకవైపు ఢీకొట్టడంతో ట్రాక్టర్‌ వెనుక చక్రం కింద పడి తల నుజ్జయి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సురేష్‌ భార్య, కుమార్తె, బంధువులు సంఘటనా స్థలం వద్ద గుండెలవిసేలా విలపించారు. ఎస్సై ప్రసాద్‌రెడ్డి ప్రమాద తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

విద్యుదాఘాతంతో..
కావలి : స్తంభం వద్ద సర్వీస్‌ వైరును పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కొండాపురం మండలం రేనమాల గ్రామానికి చెందిన కారుపోతల మాలకొండయ్య(55) ఇంటికి విద్యుత్తు సరఫరా సరిగా రాకపోవడంతో సమీపంలో ఉన్న ఎక్కి పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై కింద పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను చికిత్స నిమిత్తం కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని