కేంద్ర విద్యాసంస్థలపై శీతకన్ను
logo
Published : 12/06/2021 03:51 IST

కేంద్ర విద్యాసంస్థలపై శీతకన్ను

ఏడాదిన్నరగా  కదలిక లేని వైనం

సీపెట్‌ కాలేజీ ప్రకటనతో సరి

కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటుపై తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏడాదిన్నర కిందట నాయుడుపేటలో ఏర్పాటు చేయదలచిన సీపెట్‌ (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ) ప్రకటనలకే పరిమితమైంది. ఏడాదిన్నర కిందట ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి సదానందగౌడ మరో సీపెట్‌ కేంద్రం ఏర్పాటుకు సానుకూలం వ్యక్తం చేశారు. అప్పట్లో కృష్ణాజిల్లాలో ఓ కేంద్రం ప్రారంభించగా మరో కేంద్రం అవసరాన్ని సీఏం వివరించడంతో కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దీని ద్వారా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉపాధి దొరుకుతోంది. పారిశ్రామిక ప్రాంతంలో విద్యాసంస్థ ఏర్పాటు ద్వారా వేల మంది నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సంస్థ పట్ల అడుగులు ముందుకు పడలేదు.

న్యూస్‌టుడే, నాయుడుపేట గ్రామీణం : నాయుడుపేట పారిశ్రామికవాడలో కేంద్ర పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీని విద్యాసంస్థగా ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దేశంలో సీపెట్‌ కళాశాలలు 37 ఉన్నాయి. కొత్తగా అయిదు చోట్ల వీటిని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేశారు. స్కిల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే ఒకటి ప్రారంభించగా మరొకటి సంస్థ అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించారు. దీంతో రెండో సీపెట్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం లోక్‌సభ పరిధిలో నైపుణ్య శిక్షణ సంస్థలను నెలకొల్పనున్నారు. వీటికంటే ప్రతిష్ఠాత్మకమైన సీపెట్‌ ఏర్పాటుతో జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్, డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అటు చిత్తూరు, ఇటు నెల్లూరు జిల్లాలోని పారిశ్రామికవాడల్లో ఉద్యోగాలు పొందడానికి ఇక్కడ శిక్షణ తీసుకోవచ్చనది యువత ఆశ కాగా .. ఆ తర్వాత పాలకుల శ్రద్ధ లేకపోవడంతో అడుగులు ముందుకు పడలేదు.

మానవ వనరుల లోటు 

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి గతంలో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌   ప్రయత్నించారు. అప్పట్లో స్థలం కోసం అన్వేషణ మొదలు కాగా స్థలం ఎంపిక పూర్తి కాలేదు. పెళ్లకూరు మండలం పాలచ్చూరు, చిల్లకూరు గ్రామాల్లో దీనిని ఏర్పాటు చేయాలని స్థలాన్ని సైతం పరిశీలించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో స్థల ఎంపిక పూర్తి కాలేదు. దీంతో దీనిని మరికొందరు ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నించినట్లు సమాచారం. స్థలం చూపించి కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఇదీ ఇతర ప్రాంతాలకు తరలిపోయే ప్రమాదమేర్పడింది. ఆ తర్వాత హామీగా నిలిచిన సీపెట్‌ విద్యాసంస్థదీ ఇదే తీరుగా ఉంది. సీపెట్‌ ఏర్పాటు ద్వారా 75 శాతం స్థానికులకు ఉపాధిలభించే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్థానికులకు ఉపాధి కల్పించడానికి చట్టం కూడాచేసింది. ఈమేరకు నైపుణ్యం కల్పించడానికి ఇలాంటి సంస్థల అవసరం ఎంతైనా ఉంది.

యువతకు ఉపాధి, శిక్షణ : సంప్రదాయ విద్యతో యువతకు ఉపాధి దొరికే వాటిపై నైపుణ్యం లేకుపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్య శిక్షణ కాలేజీల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇదే కోవలో సీపెట్‌ ఏర్పాటు ద్వారా ఇక్కడ కొందరికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రారిశ్రామిక ప్రాంతంలో స్థలం కూడా అందుబాటులో ఉండగా దానికోసం ప్రయత్నాల్లో కాస్త జాప్యం జరిగింది. తదుపరి అడుగులు వేయడంలో నిర్లక్ష్యం కన్పిస్తోంది. సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ యువతకు ఉపాధి, శిక్షణ సంస్థల అవసరం ఉంది. ఈ రెండు సంస్థల జాప్యంపై తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి దృష్టికి ‘న్యూస్‌టుడే’ తీసుకెళ్లగా ఆయా సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతామన్నారు. కేంద్రీయ విద్యా సంస్థ స్థలం ఎంపిక చేసేవిధంగా అధికారులకు ఆదేశాలివ్వనున్నట్లు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని