యంత్రం సిద్ధం సాగుకు సన్నద్ధం 
logo
Published : 12/06/2021 03:51 IST

యంత్రం సిద్ధం సాగుకు సన్నద్ధం 

రైతుల చెంతకు ఆధునిక పరికరాలు

మొదటి విడతలో 205 గ్రూపుల ఎంపిక

దుత్తలూరులోని రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే)

న్యూస్‌టుడే, దుత్తలూరు, కావలి : జిల్లాలోని అనేక మంది రైతులు గత కొన్నేళ్లుగా యంత్ర సేద్యం దిశగా ముందుకుసాగుతున్నారు. పొలాల్లో యంత్రాల వినియోగం గతంతో పోల్చుకుంటే ఇటీవల బాగా పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుండగా సుమారు 2 లక్షల హెక్టార్లకుపైగా వివిధ రకాల పంటలను సాగుచేసేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. గతంలో ఉన్న యాంత్రీకరణ పథకంలో కొద్ది మార్పులు చేసి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్‌ యంత్ర సేవ’ పథకాన్ని రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా రైతులను బృందాలుగా ఏర్పాటుచేసి ఒక్కో బృదానికి రూ.15 లక్షల విలువ చేసే యంత్రాలను అందించనున్నారు.

ఏడాదిగా ఎదురుచూపులు..

గతేడాది రైతు భరోసా కేంద్రాల్లో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి యంత్రాలు, పరికరాలు అందజేయాలని నిర్ణయించారు. గ్రూపునకు ఐదుగురు వంతున సభ్యులను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు కేటాయించారు. సభ్యులంతా బ్యాంకుల్లో ఖాతాలు కూడా తెరిచారు. అప్పటినుంచి వీరు యంత్ర పరికరాల కోసం నిరీక్షిస్తున్నారు. గత పథకంలో కొన్ని మార్పులు చేసిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇవ్వనుండగా.. మిగిలిన 60 శాతంలో రైతు వాటా 10 శాతం, మిగతా 50 శాతం బ్యాంకు రుణంగా కేటాయించారు.

వ్యవసాయంలో రైతులు పడుతున్న కష్టాల నుంచి ఉపశమనం కల్పించేందుకు యంత్రాలు సన్నద్ధం అవుతున్నాయి. పెరిగిన ఖర్చులు.. భారమైన వ్యవసాయంతో తీవ్ర వేదనలో ఉన్న అన్నదాతలకు ఆసరాగా ఉండేందుకు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని రైతులకు యంత్రపరికరాలు అందించేందుకు అధికారులు సిద్ధం అవుతుండగా మొదటి విడతగా ఇప్పటికే 205 బృందాలను గుర్తించారు. వీరికి త్వరలోనే యంత్ర పరికరాలు సమకూర్చి సాయం చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.

ఆర్‌బీకేల్లో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు..

వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకంలో భాగంగా రైతు భరోసా కేంద్రానికి ఒకటి వంతున కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రం, రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున హైటెక్‌ హబ్బులు ఏర్పాటు చేశారు. గ్రూపులకు అవసరమైన ఆధునిక యంత్ర పరికరాలను మూడు దశల్లో అందించనున్నారు. తొలి విడత జులైలో, రెండో విడత సెప్టెంబరులో, మూడో విడత డిసెంబరులో నిధులు కేటాయించనున్నారు. వైఎస్‌ఆర్‌ యంత్ర సేవ పథకంలోకి కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను తీసుకుని వచ్చారు. రైతు గ్రూపులు తీసుకున్న అన్ని యంత్రాలను ఈ కేంద్రాల్లో ఉంచుతారు. వారు ఉపయోగించుకుంటూనే స్థానికంగా అవసరమైన వాటికి బాడుగకు ఇచ్చేందుకు వీలుంది. జిల్లాలో మొత్తం 660 ఆర్‌బీకేలు ఉండగా.. అన్నింటిలో రైతు గ్రూపులు ఉన్నాయి. వాటిల్లో తొలి విడతగా 205 గ్రూపులకు ఈ పథకం వర్తింపజేయనున్నారు.

అవకాశాన్ని ఉపయోగించుకోవాలి : శివన్నారాయణ, ఇన్‌ఛార్జి వ్యవసాయశాఖ జేడీ

జిల్లాలో వైఎస్‌ఆర్‌ యంత్ర సేవ పథకాన్ని మూడు విడతల్లో అమలు చేయనున్నాం. మొదటి విడత జులై, రెండో విడత సెప్టెంబరు, మూడో విడత డిసెంబరులో ఉంటుంది. ప్రస్తుతం 205 కేంద్రాల్లో ఈ పథకం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం రాయితీ ఇస్తుండగా, బ్యాంకు రుణం కూడా అందించేందుకు సిద్ధం అవుతోంది. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.


రైతులకు అందించనున్న పరికరాలు

 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని