వసూళ్ల చీడ
logo
Published : 12/06/2021 03:51 IST

వసూళ్ల చీడ

ఆరోగ్యశ్రీ ఐవీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు


బాధితురాలికి చెక్కు రూపంలో నగదును తిరిగి అందిస్తున్న ఆరోగ్యశ్రీ సిబ్బంది

జలదంకి మండలం చామదాల గ్రామానికి చెందిన ఓ మహిళ కొవిడ్‌తో కావలి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఈమె చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ఐవీఆర్‌ఎస్‌ నుంచి బాధితురాలికి ఫోన్‌ రాగా.. తమ నుంచి డబ్బు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి జిల్లా ఆరోగ్యశ్రీ అధికారులకు సంబంధిత ఫిర్యాదు రావడంతో విచారణ నిర్వహించారు. ఆసుపత్రి వారు వసూలు చేసిన రూ. 70వేల మొత్తాన్ని బాధితురాలికి తిరిగి చెల్లించేలా చర్యలు చేపట్టారు.

కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు నిమిత్తం ఇద్దరు మహిళలు చేరారు. ఆరోగ్యశ్రీలో భాగంగా వైద్యులు వారికి ప్రసవాలు చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన తర్వాత ఐవీఆర్‌ఎస్‌ నుంచి వారికి ఫోన్‌ వచ్చింది. ఆసుపత్రిలో తమ నుంచి డబ్బు వసూలు చేశారని సదరు మహిళలు ఫిర్యాదు చేశారు. సదరు వైద్యుల బండారం బయటపడింది. దీనిపై విచారణ సైతం నిర్వహించగా.. వసూళ్లపర్వం నిజమేనని తేలింది.

న్యూస్‌టుడే, నెల్లూరు(వైద్యం) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి చీడ పడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. పేద, మధ్య తరగతి వారికి ఎంతో ఉపయుక్తంగా మారుతున్న ఈ పథకంలో రాబంధులు పుట్టుకొస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటు ద్వారా నిరుపేదలు శస్త్రచికిత్సలు చేయించుకుని ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితుల నుంచి అక్రమ వసూళ్ల పర్వం నడుస్తోంది. ప్రభుత్వం ఒక్కో వ్యాధికి ఒక్కో విధంగా నగదును చెల్లిస్తున్నా.. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు పక్కదారిలో బాధితుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. నిరుపేదలను సైతం వీరు వదలకపోవడం గమనర్హం. కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్న వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు పిండుకుంటున్నారు. సాధారణ వ్యాధులు, శస్త్రచికిత్సలతో పాటు, కొవిడ్‌ను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చారు. దీంతో మహమ్మారికి గురైన బాధితులు ప్రాణభయంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరితే వారు డిశ్ఛార్జి అయ్యే సమయంలో వేలాది రూపాయలు గుంజడం పరిపాటిగా మారుతోంది. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోనూ అక్రమ వసూళ్లు చేసిన ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రులకు జరిమానాలు వేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఎన్ని ఆసుపత్రులపై జరిమానాలు విధించారనే అంశాలు బయటకు రాలేదు. మరోవైపు విధించిన జరిమానాలను తగ్గించేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంది.

ఇలా వెలుగులోకి..

ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పొందిన వారికి ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ తరచూ వస్తుంటాయి. బాధితులు ఒకసారి స్పందించకపోయినా.. మళ్లీ మళ్లీ ఫోన్స్‌ వస్తుంటాయి. ఈ క్రమంలో బాధితులను తమకు అందిన వైద్యసేవలను గురించి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటారు. ఆరోగ్యశ్రీ పథకం కింద అదనంగా డబ్బులు వసూలు చేశారా..? మరుగుదొడ్లు బాగున్నాయా..? నాణ్యమైన భోజనం పెడుతున్నారా..? తదితర వివరాలను అడిగి తెలుసుకుంటారు. బాధితులకు అన్యాయం జరిగి ఉంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్ఛు ఇలా జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్ఛార్జి అయిన వారు ఐవీఆర్‌ఎస్‌(ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌)కు ఆరోగ్యశ్రీ సేవలపై ఫిర్యాదుల చేయడంతో జిల్లా అధికారులకు వివరాలు అందుతున్నాయి. ఈ క్రమంలో విచారణ నిర్వహించి బాధితులకు సదరు సొమ్మును ఆసుపత్రుల వారి నుంచి అందజేస్తున్నారు.

 

‘ఆరోగ్యశ్రీ కింద కొవిడ్‌కు చికిత్స పొందిన తమ నుంచి డబ్బు వసూలు చేశారని 20 వరకు ఫిర్యాదులు జిల్లా ఆరోగ్యశ్రీ అధికారులకు అందాయి. వాటిపై విచారణ నిర్వహించగా... జిల్లా వ్యాప్తంగా రూ.18.10 లక్షలు వరకు ఇలా వసూలు చేశారని తేలింది. ఆ విషయాన్ని జిల్లా అధికారులు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు నివేదించారు.’

‘జిల్లా వ్యాప్తంగా 9 ఆసుపత్రులపై జేసీ ఆధ్వర్యంలోని కమిటీకి ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణలో భాగంగా ఇప్పటి వరకు రూ.21,13,400 వరకు జరిమానాలు వేశారు.’

జరిమానాలు విధిస్తాం.. : డాక్టర్‌ చంద్రశేఖర్‌, ఆరోగ్యశ్రీ, సమన్వయకర్త

ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన బాధితుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు జరిమానాలు విధిస్తాం. ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదు చేస్తే ఆసుపత్రులకు చెల్లించిన మొత్తాన్ని తిరిగి బాధితులకు అందించేలా దృష్టి సారిస్తున్నాం. ఇప్పటి వరకు 10 మంది వరకు రీ ఫండ్‌ చేశాం.

 

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని