ఏది నిజం!
logo
Published : 12/06/2021 03:51 IST

ఏది నిజం!

ప్రభుత్వానిదా? ప్రైవేటుదా?


హద్దులు పూడ్చిన ప్రభుత్వ స్థలం

 

న్యూస్‌టుడే, కాకుటూరు(వెంకటాచలం) : అది ప్రభుత్వ స్థలమని రెవెన్యూ రికార్డుల్లో పక్కాగా ఉంది. దాన్ని ఆక్రమించే యత్నాలపై ‘ఈనాడు’లో కథనం ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు. మండల సర్వేయరు ఆధ్వర్యంలో మరో నలుగురు సచివాలయ సర్వేయర్లు సర్వే చేసి.. ప్రభుత్వ భూమేనని తేల్చారు. హద్దులు ఏర్పాటు చేశారు. వారు గుర్తించిన మేరకు గుంతలు తవ్వి పక్కాగా హద్దులు పెట్టారు. ఇంత వరకు బాగానే ఉందనుకున్నా.. ప్రస్తుతం ఆ స్థలంలో ఓ వైపు తమదంటూ ఓ వ్యక్తి ఏకంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. దాంతో ఇప్పుడు ‘ఏది నిజం’ అన్నది తేల్చాల్సిన అవసరం ఏర్పడింది.

వెంకటాచలం మండలం కాకుటూరు-గొలగమూడి రోడ్డు మధ్యలో జాతీయ రహదారి పక్కన సర్వే నంబరు 16లో కోనేటి స్థలం 0.67 ఎకరాలుంది. దీన్ని ఆక్రమించేందుకు కొందరు యత్నించగా.. గత నెల 24న ‘భూ బకాసురులు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు అదే రోజు విచారణకు ఆదేశించారు. దీంతో తహసీల్దారు ఐ.ఎస్‌.ప్రసాద్‌ పర్యవేక్షణలో మండల సర్వేయరు మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేశారు. మరొకరు అందులోకి ప్రవేశించకుండా జేసీబీతో గుంతలు తవ్వారు. అది ప్రభుత్వ స్థలమని.. ఎవరూ ప్రవేశించవద్దని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

బోర్డులు తొలగించి..

ప్రభుత్వ స్థలానికి దక్షిణం వైపున ప్రైవేటు వ్యక్తులు హద్దులు ఏర్పాటు చేసి ఉండగా.. అధికారుల సర్వేలో ఆ స్థలంలో కొంత ప్రభుత్వ స్థలమని తేలింది. దాంతో అక్కడ గుంతలు తవ్వారు. బోర్డు సైతం ఏర్పాటు చేశారు. కాగా, అక్కడ ఏర్పాటు చేసిన ఆ బోర్డును పక్కన పెట్టి.. తవ్విన గుంతలను పూడ్చి కొందరు మరొక బోర్డు ఏర్పాటు చేశారు. ఆ స్థలం తమదని, అందులోకి ప్రవేశిస్తే... చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డు పెట్టారు. దీంతో అది ప్రభుత్వ స్థలమా? ప్రైవేటు స్థలమా అన్న సందేహం నెలకొంది. బోర్డు ఏర్పాటు చేసి.. చాలా రోజులవుతున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కోనేటి స్థలం రక్షణకు చర్యలు - హుస్సేన్‌ సాహెబ్‌, నెల్లూరు ఆర్డీవో

కోనేటి స్థలం రక్షణకు చర్యలు తీసుకుంటాం. దాన్ని స్థానిక అధికారులు సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేశారు. ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి.. తిరిగి హద్దులు వేయిస్తాం. తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దారును ఆదేశిస్తాం.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని