అడ్డగోలు సహకారం !
logo
Updated : 12/06/2021 06:34 IST

అడ్డగోలు సహకారం !

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు : రైతులకు ఆపన్నహస్తం ఇచ్ఛి. ఆదుకోవాల్సిన మార్కెటింగ్‌ సొసైటీలు మితిమీరిన రాజకీయ జోక్యం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో లక్ష్యాల సాధనలో వెనుకబడుతుండగా- అక్కడి చర్యలతో తరచూ ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందించడంతో పాటు పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడమే నెల్లూరు కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ప్రధాన విధి. వీటి ద్వారా వచ్చిన ఆదాయంతో సొసైటీని అభివృద్ధి చేయడంతో పాటు ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించాల్సి ఉంది. కాగా, కోఆపరేటివ్‌ చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని కొందరు అధికారులు నిధులను అడ్డగోలుగా వినియోగించడం.. పీపీసీ(ధాన్యం కొనుగోలు కేంద్రాలు)ల్లో కంప్యూటర్ల నుంచి సిబ్బందిని ఏర్పాటు వరకు ఇష్టానుసారం వ్యవహరిస్తుండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఎస్‌సీఎంఎస్‌లో సిబ్బందిని డీసీఎంఎస్‌ బైలా ప్రకారం తీసుకోవాలి. ఎవరైనా ఉద్యోగ విరమణ అయితే.. వారి స్థానంలో మాత్రమే ఉద్యోగులను తీసుకోవాలి. గంపగుత్తగా తీసుకోవడం కుదరదు. ముందుగా ప్రకటన ఇచ్ఛి. అర్హులను ఎంపిక చేసి.. కనిష్ఠ వేతనంతో కొన్ని నెలలు ప్రొబేషెనరీ కాలంగా పని చేయించాలి. కానీ, ఇక్కడ అలాంటిదేమీ లేకుండా గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఆరుగురిని విధుల్లోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు చేరిన రెండు నెలల్లోనే ఉద్యోగం మానేయగా.. మిగిలిన అయిదుగురు పని చేస్తున్నారు. వీరందరికీ ఎలాంటి ప్రొబిషన్‌ పిరియడ్‌ లేకుండా నేరుగా జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ. 15వేలు జీతం చెల్లిస్తున్నారు. ఇంత వరకు డీసీఎంఎస్‌లో కొత్తగా నియమితులైన వారికి ఇంత జీతం ఇచ్చిన దాఖలాలు లేవు. సొసైటీలో చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ.. కొత్తగా చేరిన ఒకరికి క్యాషియర్‌ పోస్టు కట్టబెట్టడంపై విమర్శలు నెలకొన్నాయి.

రూ. 30 లక్షలు వృథా

రెండేళ్ల కిందటి వరకు డీసీఎంఎస్‌ పాయింట్ల(ధాన్యం కొనుగోలు కేంద్రాలు)ను సొసైటీ ఉద్యోగుల పర్యవేక్షణలోనే నిర్వహించేవారు. ఎక్కడైనా అవసరమైతే ఒకరిద్దరిని బయట నుంచి తీసుకునేవారు. 2020-21 నుంచి పరిస్థితి మారింది. ధాన్యం కొనుగోలు సమయంలో మొత్తం 20 కేంద్రాల్లో 100 మంది పనిచేస్తుంటే.. కేవలం ఇద్దరు మాత్రమే సొసైటీ ఉద్యోగులు ఉన్నారు. విడవలూరు మండలం వావిళ్ల డీసీఎంఎస్‌, మిగిలిన 98 మందికి ఒక్కొక్కరికి నెలకు రూ. పదివేల చొప్పున వేతనం ఇచ్ఛి. మూడు నెలలకు తీసుకున్నారు. ఇలా సుమారుగా రూ. 30.9 లక్షలు వృథాగా ఖర్చు చేశారు.

 

రెట్టింపు అద్ధె..

జిల్లాలోని 21 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మూడు నెలల కాలానికి కంప్యూటర్లు, ప్రింటర్లు అద్దెకు తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రైవేటు సంస్థ నుంచి కంప్యూటర్‌కు నెలకు రూ. 1200, ప్రింటర్‌కు రూ.వెయ్యి అద్దె చెల్లించారు. ఆ విలువను ఈ ఏడాది రెట్టింపు చేశారు. అదే సంస్థకు కంప్యూటర్‌కు నెలకు రూ.2,750, ప్రింటర్‌కు రూ. 2,650 చొప్పున చెల్లించారు. ఫలితంగా మూడు నెలలకు 21 కేంద్రాలకు సంబంధించి రూ. 2.14 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది.

‘డీసీఎంఎస్‌ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ప్రభుత్వానికి చెందిన టెండర్లను కేటాయించడంలో అధికారులు ప్రాధాన్యం ఇస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకుని సొసైటీకి ఆదాయం చేకూర్చాల్సిన అధికారులు పలుమార్లు తప్పటడుగులు వేశారు. కొవిడ్‌ మొదటి దశలో డీపీఎం కార్యాలయంలో గ్లౌజుల సరఫరాకు సంబంధించిన టెండర్‌ పొందారు. చివరకు సరఫరా చేయలేమని రాసిచ్చారు. ఆ తర్వాత జిల్లాలో గ్రామ పంచాయతీలకు ఫాగింగ్‌ మిషన్ల పంపిణీపై పత్రికల్లో ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆ టెండర్లు రద్దు చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి థర్మల్‌ స్కానర్లు సరఫరాకు టెండర్లు పొంది.. ‘నాట్‌ ఫర్‌ సేల్‌’ ఉన్న ముద్ర ఉన్నవి సరఫరా చేసేందుకు యత్నించడంతో... జేసీ వాటిని గుర్తించి వాపస్‌ చేశారు.’

నిబంధనలకు విరుద్ధంగా...

ఎన్‌డీసీఎంఎస్‌కు బిజినెస్‌ మేనేజర్‌ను నియమించే అధికారం కమిషన్‌ కోఆపరేటివ్‌కు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతమున్న బీఎంను గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి కలెక్టర్‌ శేషగిరిబాబు ఆరు నెలల కాలానికి తాత్కాలికంగా నియమించారు. సంస్థ స్థితిగతులను బట్టి వేతనం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ, ఈయన నెలకు రూ. 68,800 జీతం తీసుకుంటున్నారు. పైగా అప్పటి కలెక్టర్‌ బదిలీపై వెళ్లడంతో... విషయం గోప్యంగా ఉంచి పదవిలోనే కొనసాగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన చేరక ముందు డీసీఎంఎస్‌ చరిత్రలో విశ్రాంత ఉద్యోగి బీఎంగా చేసిన దాఖలాలు లేవని, కోఆపరేటివ్‌ సొసైటీలో చేస్తున్న వారినే డిప్యూటేషన్‌పై వేసేవారని, తద్వారా సొసైటీ నిధులు పక్కదారి పట్టినా.. వారి జీతం నుంచి తీసుకునే వీలుంటుందంటున్నారు.

పరిశీలించి చర్యలు - హరేంధిర ప్రసాద్‌, జేసీ(రెవెన్యూ)

డీసీఎంఎస్‌లో నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగులను తీసుకోవడంపై పరిశీలిస్తాం. బిజినెస్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారి నేను ఇక్కడకు రాకుముందు నుంచే విధుల్లో ఉన్నారు. ఆయన నియామకం ఏ విధంగా జరిగిందో తెలియదు. 2019లో ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులను తొలగించాలని జీవో జారీ చేసింది. దీనిపై విచారణ చేపడతాం. కంప్యూటర్లు, ప్రింటర్ల అద్దె ధరల రెట్టింపు విషయం పరిశీలించి నిరూపణ అయితే కఠిన చర్యలు తీసుకుంటాం. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు నాసిరకం సరకు సరఫరాపైనా చర్యలు తీసుకుంటాం. ఉప ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కొవిడ్‌ విధుల్లో తీరిక లేకుండా ఉన్నాం. అన్నింటిని క్షుణ్నంగా పరిశీలించి తగు రీతిలో స్పందిస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని