జొన్న రైతుకుదక్కని భరోసా
logo
Published : 12/06/2021 03:51 IST

జొన్న రైతుకుదక్కని భరోసా


వెనక్కు పంపిన జొన్నలు దించుకుంటున్న రైతులు

చేజర్ల : చేను వద్దే పంట మొత్తం కొంటామని చెబుతున్న యంత్రాంగం- కొనుగోళ్ల వద్దకు వచ్చేసరికి కొర్రీలు వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతుల నుంచి పంట కొనుగోలు చేసే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరి రైతులకు బ్యాంకు గ్యారెంటీలు, చిరుధాన్యాల రైతులు నాణ్యతా ప్రమాణాల రూపంలో ప్రయాసలకు గురవుతుండగా- జొన్న రైతులకు ఇప్పుడు సరికొత్త సమస్య ఎదురైంది. చేజర్ల మండలం కాకివాయి, కండాపురం గ్రామాల రైతులు తాము పండించిన జొన్న పంటను మద్దతు ధరకు అమ్ముకునేందుకు ఎనమదల రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకున్నారు. గత శని, ఆదివారాల్లో మార్క్‌ఫెడ్‌ అధికారులు కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. అకాల వర్షానికి పంట రంగు మారడంతో ఇక్కడి జొన్నల్ని పశువుల దాణా రకంగా గుర్తించారు. నాణ్యమైన రకానికి రూ. 2550 మద్దతు ధర ఉండగా, ఈ రకానికి రూ. 1850 నిర్ణయించారు. నాణ్యతా విభాగం ప్రతినిధులు రైతుల నుంచి క్వింటాలుకు రూ.100 వసూలు చేసి జొన్నల్ని జల్లెడ వేసి ట్రక్‌షిట్‌ తీసి లారీల్లో నింపి గూడూరులోని నిల్వ కేంద్రానికి తరలించారు. తీరా అక్కడికి వెళ్లాక.. అధికారులు నాణ్యత లేదని, పురుగుపట్టిన గింజలంటూ దించుకోలేదు. లారీకి అద్దె చెల్లించి.. గింజలను వెనక్కు తీసుకువెళ్లమని రైతులకు సూచించారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు లారీలను పంపితేనే తాము గింజలను తీసుకొచ్చామని.. తిరిగి ఎక్కడికి తీసుకువెళ్లాలంటూ రైతులు ప్రశ్నిస్తే.. నాణ్యతా విభాగం సిబ్బంది బాధ్యతారాహిత్యంతో ఇలా జరిగిందని, వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అన్నట్లుగానే జొన్నల లారీలను శుక్రవారం కాకివాయి, కండాపురం గ్రామాలకు పంపారు. కాకివాయి రైతులు బస్తాలను వెనక్కు తీసుకోగా- కండాపురం రైతులు ససేమిరా అన్నారు. దీంతో ఒక లారీని పొదలకూరు మార్కెట్‌ యార్డు వద్దకు తరలించారు. తమకు సొమ్ములు చెల్లించకుంటే న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు.

పురుగు పట్టిన కారణంగానే...: డీఎం మార్క్‌ఫెడ్‌

ఎనమదల ఆర్బీకే పరిధిలోని, కాకివాయి, కండాపురం గ్రామాల్లో సేకరించిన జొన్నలు పురుగుపట్టి ఉన్నాయి. వాటి కారణంగా గోదాముల్లోని మిగిలిన నిల్వలు దెబ్బతింటాయని లారీలను వెనక్కి పంపాం. నాణ్యతా విభాగంలోని సిబ్బంది జొన్నలు సరిగా పరిశీలించకుండా సేకరించిన కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతుల నుంచి రవాణా ఛార్జీలు వసూలు చేయకుండా వారి గింజల్ని వారికి అప్పగిస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని