Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పడకల కొరత.. పాట్లు కనరేమయ్యా!

ఆక్సిజన్, వెంటిలేటర్లకు నిరీక్షణ
 ఆసుపత్రి బయట పడిగాపులు


బాధితులు, వారి సహాయకులతో నిండిపోయిన జీజీహెచ్‌ క్యాజువాలిటీ

జిల్లాలోని ఆసుపత్రుల్లో పడక లభించడం గగనమవుతోంది. ప్రవేశం పొందిన వారు కనీసం 10 రోజుల వరకు చికిత్స తీసుకోవాల్సి ఉండటంతో ఖాళీ ఉండటం లేదు. కొవిడ్‌ లక్షణాలు ఉంటే.. వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని అధికారులు చెబుతుండటంతో.. కాస్త ఇబ్బందిగా అనిపించినా.. వెంటనే బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో 104కు ఫోన్‌ చేసి పడకల నమోదుకు యత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 34 ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్సకు అనుమతిచ్చారు. అధికారిక లెక్కల వీటిలో 1299 ఆక్సిజన్‌ పడకలు ఉండగా- 1249 నిండిపోయాయి. కేవలం 50 ఖాళీగా ఉన్నాయి. 152 ఐసీయూ పడకలకు 9 ఖాళీగా ఉన్నాయి. ఇక వెంటిలేటర్‌ సదుపాయమున్నవి 183 ఉంటే.. అన్నీ నిండిపోయాయి. కానీ, క్షేత్రంలో వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఒక్కో ఆసుపత్రి ఎదుట ఆక్సిజన్‌ పడకల కోసం బాధితులు పెద్దఎత్తున పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి నిరీక్షించినా.. పడకలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా పడకలు ఖాళీ లేవన్న మాట వినిపిస్తుండగా- ఆక్సిజన్‌ స్థాయిలు గణనీయంగా పడిపోయి.. ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అటు ప్రైవేటు ఆసుపత్రుల్లో.. ఇటు జీజీహెచ్‌లో ఈ పడకలు ఖాళీగా లేవు. ఇంకోవైపు ఆక్సిజన్‌ సరఫరా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆక్సిజన్, వెంటిలేటర్‌ పడకల సంఖ్యను పెంచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదు. 
పెంచితేనే వైద్యం
జీజీహెచ్‌తో పాటు ఇతర ఆసుపత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్‌ పడకల సంఖ్య పెంచడానికి వైద్యాధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత ఏడాది కొవిడ్‌ సమయంలో దాదాపు 350 వెంటిలేటర్లను ప్రభుత్వం సర్వజన ఆసుపత్రికి కేటాయించగా- వాటిలో కేవలం 50 మాత్రమే వినియోగిస్తున్నారు. నారాయణ ఆసుపత్రికి 30 వరకు ఇచ్చారు. మిగిలినవన్నీ నిరుపయోగంగా మారాయి. టీఎస్‌ఆర్‌ ఆసుపత్రి పాత భవనంలో గతంలో ఏర్పాటు చేసిన
వార్డులు ఉన్నాయి. వీటికి ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించిన పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తే, మిగిలిన పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని, విషమ పరిస్థితుల్లో ఉన్న బాధితులను కాపాడే అవకాశం ఉందని పలువురు
కోరుతున్నారు. 

* కావలికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తొలుత మద్దూరుపాడు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తీసుకువెళ్లారు. పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దాంతో హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. తీరా ఇక్కడికి వస్తే.. పడకలు లేవని సమాధానం వచ్చింది. బుధవారం రాత్రి 1 గంట వచ్చిన వారికి గురువారం మధ్యాహ్నం వరకు పడక కేటాయించలేదు. బాధితుడి బంధువులు ఆసుపత్రి సిబ్బందిని గట్టిగా నిలదీస్తే.. మీ కంటే ముందు దాదాపు 120 మంది నిరీక్షణలో ఉన్నారని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 
* నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ వ్యక్తి వారం రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. వైద్యుల సూచనలు పాటిస్తూ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఉన్నట్టుండి.. బుధవారం రాత్రి ఆక్సిజన్‌ స్థాయి 85శాతానికి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. పడకలు లేవని చెప్పడంతో.. వెంటనే నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు. అక్కడా అదే సమాధానం. దీంతో చేసేదేమీ లేక మళ్లీ ప్రభుత్వాసుపత్రి దగ్గరకు వచ్చి.. పడక కోసం నిరీక్షించారు. ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నానికి దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. 


కాన్‌సన్‌ట్రేటర్ల సాయంతో కుర్చీల్లోనే ఆక్సిజన్‌ తీసుకుంటూ.. 

అత్యవసరమైతే ఇబ్బందే...
నెల్లూరు సర్వజన ఆసుపత్రిలో మొత్తం 864 పడకలు ఉండగా- ఐసీయూ, వెంటిలేటర్లలో 150 ఉన్నాయి. ఇవన్నీ నిండిపోయాయి. ఇంకా చాలా మందికి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు పెట్టి.. క్యాజువాలిటీలో చికిత్స అందిస్తున్నారు. ఏదైనా పడక ఖాళీ అయితే.. అప్పటికే నిరీక్షిస్తున్న వారిలో.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న వారికి కేటాయిస్తున్నారు. ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో 76 పడకలు ఏర్పాటు చేశారు. ఊపిరితిత్తులు అధికంగా దెబ్బతిన్న వారికి వెంటిలేటర్‌ అవసరం ఉంటుంది. జిల్లాలో కొవిడ్‌ చికిత్స అందిస్తున్న వారిలో 183 వెంటిలేటర్ల సౌకర్యం ఉంది. ప్రస్తుతం అవన్నీ నిండిపోయాయి. కొందరు పది రోజులు ఉన్నా కోలుకోవడం కష్టంగా ఉంది. దీంతో పడకలు ఖాళీ కావడం లేదు. జీజీహెచ్‌కు రోజుకు 250 మంది రోగులు వస్తుంటే.. వీరిలో 80 శాతం ఆక్సిజన్‌ పడకలు కావాల్సి ఉండగా.. అయిదు శాతం వెంటిలేటర్‌ కోసం వస్తున్నారు. ఈ క్రమంలో చాలా మందికి పడకలు దొరక్కపోవడంతో అంబులెన్సుల్లో ఆక్సిజన్‌ పెట్టుకుని గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని