Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెలవంక మెరిసి..ఇలవంక మురిసి.

.
విద్యుదీపాలంకరణతో అమినీయా మసీదు

నెల్లూరు (సంక్షేమం), (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ పండగను ఘనంగా జరుపుకొనేందుకు ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. గురువారం సాయంత్రం నుంచే నెలవంక దర్శనం కోసం నిరీక్షించారు. పలు ప్రాంతాల్లో దర్శనమిచ్చిందన్న సమాచారంతో శుక్రవారం ఈద్‌-ఉల్‌-ఫితర్‌ జరుపుకోవాలని బారాషహీద్‌ ఈద్గా ఇమామ్‌ సయ్యద్‌ అబూబకర్‌ ఆష్రఫీ సాబిరితో పాటు పలువురు మత పెద్దలు ప్రకటించగా... ఆ మేరకు ముస్లిం సోదరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 
ముస్తాబైన మసీదులు
కొవిడ్‌ దృష్ట్యా ఈ సారి ఈద్గాల్లో నమాజ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. మసీదులు, ఇళ్లలో జరుపుకోవాలని సూచించింది. దాంతో జిల్లాలోని మసీదులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 50 మంది చొప్పున పండగ నమాజ్‌ చేసుకోవాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మసీదు నిర్వాహకులకు జిల్లా వక్ఫ్‌బోర్డు సహాయ అధికారి అబ్దుల్‌ హమిద్‌ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. 50 మంది కంటే ఎక్కువ ఉంటే.. పలు పర్యాయాలు నిర్వహించాలని సూచించారు. దీంతో ఆ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇళ్లలోనే వజూలు చేసుకుని, జానీమాజ్‌ తీసుకురావాలని ఆయా మసీదుల నిర్వాహకులు ముందుగానే సూచించారు. ఎక్కువ మసీదుల్లో ఉదయం 6.30, 7.30, 9.30 గంటలకు పండగ నమాజ్‌ చేసుకునే ఏర్పాట్లు చేశారు. 
అధికారుల చర్యలు
కొవిడ్‌ నిబంధనల మేరకు పండగ జరుపుకొనేలా పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సూచనలు చేశారు. గుంపులుగా నిలవకూడదని పోలీసులు హెచ్చరికలు చేశారు. కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలు నేపథ్యంలో ఎక్కువ మంది హాజరయ్యే ప్రాంతాల్లో ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నగరంలోని కోటమిట్ట, బర్మాషెల్‌ గుంట, జెండా వీధి, మూలాపేట తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది తిరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


నెల్లూరు: నెలవంక దర్శనంతో వీధుల్లో యువకుల భక్తిగీతాలాపన  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని