Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెన్నమ్మ.. చెర వీడేదెన్నడమ్మా!


నది పొరంబోకు భూముల్లో వేరుసెనగ సాగు

చేజర్ల, న్యూస్‌టుడే పెన్నా తీరంలో ఏళ్లుగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. అది ఇప్పటికీ కొనసాగుతుండగా- అడ్డుకునే వారే కరవయ్యారు. పైగా ఆక్రమిత భూముల్లో వందల సంఖ్యలో ఫిల్టర్‌ పాయింట్లు వేసి.. సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పంపులు క్యూసెక్కుల కొద్దీ నీటిని తోడేస్తున్న పరిస్థితి. ఇలాంటి మోటార్లు వందల సంఖ్యలోనే ఉండగా- వీటి ద్వారా సోమశిల జలాశయం నుంచి నెల్లూరు నగరానికి తాగునీటికి విడుదల చేసిన నీటిని మింగేస్తున్నాయి. ఫలితంగా వేసవిలో నగరవాసులు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ సమయంలో అధికారులు అక్రమ మోటార్లకు విద్యుత్తు సరఫరా నిలిపివేసి నీటిని మళ్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. 
భారీగా విద్యుత్తు చౌర్యం
సాధారణంగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్‌ రైతుల పొలంలోని బోరు, బావికి మంజూరు చేయాల్సి ఉంది. రైతుకు పలానా సర్వే నంబరులో భూమి ఉందని గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తే... విద్యుత్తుశాఖ రైతు నుంచి ఒప్పంద పత్రం తీసుకుని పంపుసెట్లకు కనెక్షన్‌ ఏర్పాటు చేస్తుంది. పెన్నా తీర గ్రామాల్లో ఈ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. ఆక్రమణదారులు పలుకుబడితో సమీపంలోని రైతుల సర్వే నంబరు చూపి ప్రభుత్వ భూముల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 40 మీటర్ల దూరం ఉండే అర ఎకరం పొలానికి రెండు  కనెక్షన్లు, ఆరేసి విద్యుత్తు స్తంభాలు, 300 మీటర్ల విద్యుత్తు తీగ మంజూరు చేశారు. చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లిలో తీరంలోని 20 ఎకరాల భూములకు 32 విద్యుత్తు కనెక్షన్లు, ఎనిమిది ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేశారు. అధికారిక కనెక్షన్లకు రెట్టింపు సంఖ్యలో అధిక సామర్థ్యం కలిగిన మోటార్లు ఏర్పాటు చేస్తూ.. వాటి ఆధారంగా భారీ స్థాయిలో విద్యుత్తు చౌర్యానికి యంత్రాంగమే అవకాశం కల్పిస్తోందన్న ఆరోపణలు.. విమర్శలు ఉన్నాయి.  

 ఒక్క చేజర్ల మండలం పెళ్లేరులోని 648 సర్వే నంబరులోని పెన్నా పోరంబోకు భూముల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 25కు పైగా బోర్లు వేయించారు. స్థానికంగా ఉండే మరికొందరు పెద్దఎత్తున ఆక్రమించి.. ఆ భూముల్లోకి ఇతరులను రానీయడం లేదు. దీనిపై గత ఏడాది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తిమ్మాయిపాలెంలోని ఒకటో సర్వే నంబరులో ఆక్రమణలపై పలు వివాదాలు ఉన్నాయి. కోటి తీర్థంలోనూ భూ ఆక్రమణలు అధికమే. వీటిపై తూర్పుకంభంపాడు, కోటితీర్థం గ్రామాల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారుల ఆదేశాలనూ బేఖాతరు చేస్తుండటం గమనార్హం.

ప్రభుత్వ భూమి.. ప్రకృతి వనరులు.. ఉచిత విద్యుత్తు ఆక్రమణదారులకు ఆదాయ వనరులుగా మారి రూ. లక్షలు ఆర్జించి పెడుతున్నాయి. జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు విడుదల చేసే తాగునీరు, పేద రైతులకు ఇచ్చే విద్యుత్తు పెద్ద ఎత్తున చౌర్యానికి గురవుతోంది. విశాల నదీ భూములు ఆక్రమణదారుల చెరలో చిక్కిపోతుండగా- మేత, నీరు కరవై మూగ జీవాలు అల్లాడుతున్న పరిస్థితి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో  పరిమితం కాదు. జిల్లాలోని 11 మండలాల్లో.. పెన్నా నదీ తీర గ్రామాల్లో సాగుతున్న దందా. 

తరచూ వివాదాలు
ఆక్రమణలు గ్రామాల్లో తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. ఆక్రమణదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటుండటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. పలు ప్రదేశాలపై నిషేధాజ్ఞలు విధించినా.. ఆక్రమణదారులకు రెవెన్యూశాఖ నోటీసులు జారీ చేసినా.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతోంది. చేజర్ల మండలం పెళ్లేరులోని 649 సర్వే నంబరులో 638 ఎకరాల్లో సగానికిపై ఇతర ప్రాంతాల వారు ఆక్రమించారని, ఆ కారణంగా తమ ఊరి ప్రజల అవసరాలకు ఇబ్బందిగా ఉందని మజరా గ్రామమైన పుల్లనీళ్లపల్లివాసులు గత ఏడాది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఆయన విచారణకు ఆదేశించారు. రెవెన్యూ యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినా ఆక్రమణలు ఆగలేదని గ్రామస్థులు వివరించారు. ఈ భూమి సాగు చేయకుండా ఆపాలని, బోర్లకు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని వారు కోరుతున్నారు. 


ఆక్రమణలో ఉన్న పెన్నాతీర భూములు 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని