Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యుత్తు ఉద్యోగులపై...మహమ్మారి పంజా

తొమ్మిది మంది మృతి

నెల్లూరు (విద్యుత్తు): విద్యుత్తుశాఖపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అసలే వేసవి.. ఆపై విపత్తు.. ఇంతటి కీలక సమయంలో విధులు నిర్వహిస్తున్న ఈ శాఖ ఉద్యోగుల్లో చాలా మంది మహమ్మారి బారిన పడ్డారు. తొమ్మిది మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమనూ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి.. తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జిల్లాలో ఆరు విద్యుత్తు డివిజన్లు ఉండగా- వీటి పరిధిలో 261 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. 9.89 లక్షల గృహ సర్వీసులు, 1.70 లక్షల వ్యవసాయ సర్వీసులు, 652 హెచ్‌టీ సర్వీసులు సర్వీసులు ఉండగా- వీటన్నింటిని పర్యవేక్షించేందుకు రెండు వేల మంది శాశ్వత ఉద్యోగులతో పాటు 2,500 మంది తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. విద్యుత్తు లైన్లు, సబ్‌స్టేషన్ల మరమ్మతులు.. ఇలా ఎక్కడ ఏ సమస్య వచ్చినా... వీరికి క్షేత్రానికి వెళ్లక తప్పని పరిస్థితి. ఆ క్రమంలో ప్రస్తుతం కరోనాతో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 190 మంది ఉద్యోగులు వైరస్‌ బారిన పడ్డారు. నెల్లూరు సర్కిల్‌ ఎస్‌ఈ ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. మొత్తంగా ఈ రెండు నెలల్లో ఒక ఏఈ, సహాయ లైన్‌మెన్‌, నలుగురు లైన్‌మెన్లు, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు, ఒక షిఫ్ట్‌ ఆపరేటర్‌ మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుత పరిస్థితుల్లో విధులకు వెళ్లాలంటేనే భయమేస్తోందని ఉద్యోగులు, ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా తమకు టీకా వేయించేందుకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలతోనే విధులు : డీఈటీ రమణాదేవి
కరోనా వేళ విద్యుత్తు సరఫరా పూర్తిస్థాయిలో ఇవ్వాలన్న నిబంధనతో ఉద్యోగులు పని చేస్తున్నారు. 190 మంది వరకు కరోనాతో వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మంది మృతి చెందారు. ప్రతి విద్యుత్తు ఉద్యోగికి టీకా ఇవ్వాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యశాలలకు 24 గంటలూ విద్యుత్తు సరఫరా ఇస్తున్నాం. వైద్యశాలల లోపల అనేక లోపాలు ఉన్నాయి. వాటిని గుర్తించి సరిచేసుకోవాలని ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు సూచించాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని