Published : 14/05/2021 06:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గూడూరు నుంచి ఆత్మకూరుకు ఆక్సిజన్‌ : మంత్రి


అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి మేకపాటి

ఆత్మకూరు, న్యూస్‌టుడే : ఆత్మకూరు నియోజకవర్గ అవసరాలకు ఆక్సిజన్‌ను గూడూరు నుంచి తెచ్చుకొనే ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ప్రతిరోజు 100 ఆక్సిజన్‌ సిలిండర్లు గూడూరు నుంచి తెచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గురువారం ఆత్మకూరు నియోజకవర్గ అధికారులతో నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విశాఖ మెడిటెక్‌ జోన్‌ నుంచి 10-15 వరకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు జిల్లాకు రెండు రోజుల్లో తెప్పిస్తామన్నారు. ఆత్మకూరు టిడ్కో క్వారంటైన్‌ సెంటర్‌లో 2 సీసీ కెమరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు జిల్లా వైద్యశాల కొవిడ్‌ సెంటర్‌, టిడ్కో సెంటర్లలో కొరత ఉన్న ఎంఎన్‌వో, సహాయక సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆర్డీవో చైత్రవర్షిణికి సూచించారు. నియోజకవర్గంలో కొవిడ్‌ కేసుల తీవ్రతపై ఆర్‌ఎంవో ఉషాసుందరిని, మృతుల అంత్యక్రియలపై కమిషనర్‌ రమేష్‌బాబును అడిగి వివరాలు తెలుసుకొన్నారు. ఆత్మకూరు చెరువు కట్ట సుందరీకరణ, బట్టేపాడు జంక్షన్‌ పార్క్‌, ఔటర్‌రింగ్‌రోడ్డుకు సంబంధించిన పనుల నమూనాలను పరిశీలించారు. రూ.5కోట్లు సీఎస్‌ఆర్‌ నిధులు సమకూరుస్తామని, వాటిని సుందరీకరణ పనులకు ఉపయోగించాలన్నారు. పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా నియోజకవర్గంలో రూ.10కోట్లతో అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని