Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గురుకులమా..కష్టాల వనమా !

నెల్లూరు గిరిజన బాలికల గురుకులంలో భోజనం చేస్తున్న బాలికలు

గురుకులం అంటే.. పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. సకల సౌకర్యాలు.. అత్యుత్తుమ బోధన.. ఉజ్వల భవితకు మార్గం.. అని అనుకుంటున్నారు కదూ! ఇది ఒకప్పటి మాట.. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇవి సమస్యలకు నిలయాలుగా మారాయి. చాలీచాలని భోజనం.. ఇరుకు గదులు.. ఉక్కపోత.. కొన్నిచోట్ల శిథిల భవనాలు.. రాత్రయితే భయం.. అంతా కలసి ఒకేచోట నిద్ర.. పైగా నేలపైనే.. ఫలితంగా బాలికలకు కష్టాలు.. ఇదీ ప్రస్తుతం జిల్లాలోని బాలికల గురుకులాల్లోని పరిస్థితులు. దీంతో వీటిలో చదువుకొనే బాలికలు నిత్యం కష్టాలతో సతమతమవుతున్నారు.

అన్నీ ఒకే చోట

నెల్లూరు (సంక్షేమం): జిల్లా కేంద్రమైన నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ఉన్న గిరిజన బాలికల గురుకులంలో ఇరుకు గదుల్లో బాలికలు నిత్యం అవస్థలు పడుతున్నారు. బాలికల సంక్షేమ వసతి గృహాన్ని గురుకులంగా అయిదేళ్ల క్రితం మార్పు చేశారే కాని సౌకర్యాలు కల్పించలేదు. వసతి, తరగతి గదులు, భోజనం, ఆట పాటలకు వేర్వేరు వసతులు లేవు. గతంలో 200 మందికి పైగా ఉండగా కొవిడ్‌తో ప్రస్తుతం 108 మంది ఉన్నారు. రూ.14 లక్షలతో నాడు- నేడు కింద పనులు చేశారు. అయితే తగినంత స్థలం లేక పోవడంతో, ఉన్న భవనాలకు మరమ్మతులు చేశారు.

సంఖ్య ఎక్కువ.. గదులు తక్కువ

బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని రామచంద్రాపురంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో 6 నుంచి ఇంటర్‌ వరకు 632 మందికి వసతి ఉంది. ప్రస్తుతం 628 మంది ఉన్నారు. వీరికి 12 గదులు మాత్రమే ఉన్నాయి. ఈవిషయమై గరుకులం ప్రిన్సిపల్‌ పద్మను అడగ్గా అదనపు తరగతి గదులు అవసరం ఉందన్నారు.

వసతులు కల్పిస్తున్నాం : హేమలత, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల కోఆర్డినేటర్‌ రోశిరెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి

గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. బాలికలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నాం. నాడు-నేడు పథకంలో చాలావరకు చేశాం. గిరిజన బాలికల గురుకులంలో పనులు పూర్తి చేశాం.

మురుగునీటితో తంటా

కోడూరు కళాశాలలో మురుగునీటి నిల్వ

కోడూరు (తోటపల్లిగూడూరు) : మండలంలోని కోడూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల భవనాలు సౌకర్యంగా ఉన్నా మురుగునీటి సమస్య ఏళ్లతరబడి ఇబ్బంది పెడుతోంది. కళాశాలలో 633 మంది విద్యార్థినులు ఉన్నారు. వృథా నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఆవరణలోనే నిల్వ అవుతోంది. దీంతో దుర్వాసన వస్తోంది. శాశ్వత పరిష్కారం చూపడంలో అధికార యంత్రాంగం జాప్యం చేస్తోంది. మురుగుకాలువల నిర్మాణం చేస్తున్నారు.

నేలపైనే పడక

మరుగుదొడ్లకు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

నాయుడుపేట పట్టణం : నాయుడుపేట మండలంలోని పుదూరు పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో బాలికలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. 661 మంది విద్యార్థినులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్నారు. సదుపాయాల కల్పనలో ఉన్నతాధికారులు చొరవ తీసుకోవడం లేదు. నేలపైనే చాపలు, దుప్పట్లు పరుచుకుని పడుకుంటున్నారు. 16 గదుల్లో విద్యార్థినులు పడుకుంటున్నారు. వర్షాలు కురిసినప్పుడు, చలికాలంలో నేలపై పడుకోవడం కష్టంగా ఉంది. ఈ గురుకులానికి బెడ్‌లు సమకూర్చాల్సి ఉంది. ప్రహరీ ఎత్తుగా లేదు. దీని నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది.

ఉప్పు నీరే గతి

ప్రాంగణంలో ప్రమాదకరంగా నీటిగుంత

బిట్రగుంట : బోగోలు మండలంలోని కప్పరాళ్లతిప్పలో ఉన్న బాలయోగి సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో అన్నీ సమస్యలే. 5 నుంచి 10వ తరగతి వరకు 466 మంది ఉన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కావలి ఆర్డీవో శ్రీనివాసులు చొరవతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు రోజుకు ఆరు ట్యాంకర్ల మంచినీరు సరఫరా చేస్తున్నారు. అవి చాలకపోవడంతో బోర్లలో లభ్యమయ్యే ఉప్పునీటిని కలిపి వాడుకుంటున్నారు. ఆర్వో ప్లాంట్‌ నీరు తాగుతున్నారు. ప్రాంగణంలో భారీగా ఉన్న గొయ్యిలో నీటి నిల్వ, సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌తో భయాందోళన చెందుతున్నారు. క్రీడల్లో సాధనకు మైదానం వీలుగా లేకపోవడం విశేషం.

తరగతి గదుల్లోనే నిద్ర

వెంకటగిరి : గురుకుల బాలికల పాఠశాలలో డార్మెటరీ గది పనులు అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ఏడాది క్రితం నాడు నేడు పనుల్లో భాగంగా ఆరు డార్మెటరీ గదులకు మరమ్మతులు చేశారు. మూడు గదుల పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగతా వాటి పనులు చేయకపోవడంతో తరగతి గదుల్లోనే నిద్రిస్తున్నారు. మరుగుదొడ్ల పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. భోజనశాల కూడా అధ్వానంగా ఉంది. 25 సంవత్సరాల క్రితం నిర్మించిన గదులు శిథిఫలావస్థకు చేరుకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని