Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కలిసి కదిలితేనే కట్టడి

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: జిల్లాలో కరోనా చాపకింద నీరులా విజృంభిస్తోంది. గత ఏడాది ఒకటీరెండు కేసులు వచ్చినప్పుడే అప్రమత్తమై కట్టడి చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం- ప్రస్తుతం ఎలాంటి కార్యాచరణ లేకుండా నిస్తేజంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఒక్కో ఇంట్లో నాలుగైదు కేసులు నమోదవుతున్నా.. ఆయా ప్రాంతాల్లో కనీస కట్టడి చర్యలు అటుంచి.. కనీసం సోడియం హైపో క్లోరైట్‌ ద్రావకాన్ని కూడా పిచికారీ చేయడం లేదు. ఫలితంగా ఒక్కో ప్రాంతంలో కేసుల సంఖ్య పదుల సంఖ్యలోకి చేరుతున్నాయి. ఎన్‌ఎంసీ ముందుకు రాకపోవడంతో చాలా ప్రాంతాల్లో సొంత ఖర్చుతోనే మందు పిచికారీ చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది మార్చిలో నెల్లూరు నగరంలో తొలి కరోనా కేసు వెలుగు చూసిన సమయంలో ఎన్‌ఎంసీ దోమల నివారణ విభాగంతో పాటు ప్రజారోగ్యశాఖ కీలక భూమిక పోషించింది. కట్టడికి తగు చర్యలు తీసుకోవడంతో పాటు సోడియ హైపోక్లోరైట్‌ ను డివిజన్లలో పిచికారీ చేయించారు. గత 15 రోజులుగా నెల్లూరు నగరంతో పాటు ఇతర పట్టణాల్లో పెద్ద సంఖ్యలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో గురువారం 223 మందికి పాజిటివ్‌గా తేలగా... యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,086కు పెరిగింది. ఈ పెరుగుదల ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కుటుంబాలను చుట్టేస్తూ..

కొవిడ్‌-19 కొత్త రూపు సంతరించుకుంది. పాత లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. లోపల దాగి ఉంటూ కోర చూపులతో కుటుంబాలను చుట్టేస్తోంది. గతంలో కుటుంబంలో ఒకరికి వస్తే.. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మిగిలిన వారికి రాకుండా చూసుకునే వారు. ఇప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఒకరి నుంచి ఇంట్లో అందరికీ సోకుతోంది. వారంలోనే నెగెటివ్‌ వస్తోంది. ఈ తాజా పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది. రెండో దశ వైరస్‌ తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటోంది. లక్షణాలు విచిత్రంగా ఉంటున్నాయి. చాలా మంది స్వల్ప లక్షణాలతో మూడు రోజుల్లోనే కోలుకుంటుండగా... మరికొంత మందికి ఎన్ని మందులు వాడినా జ్వరం 102-103 మధ్యే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారు అజాగ్రత్తగా ఉండటం ఎంత మాత్రం తగదని హెచ్చరిస్తున్నారు. కొందరిలో కొన్ని రోజుల పాటు కడుపు నొప్పి, విరోచనాలు అధికంగా ఉంటున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లల్లోనూ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండగా.. కాకపోతే, చిన్నారులు త్వరగా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

అవగాహన అంతంతమాత్రమే...

ఓ వైపు కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. ఎన్‌ఎంసీ అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా నెల్లూరు నగరంతో పాటు కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో మాస్కులు లేకుండా రోడ్డుపై సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మొదట్లో మొక్కుబడిగా సాయంత్రం వేళలో అవగాహన కల్పించిన వారు.. ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. పరీక్షల్లో జాప్యం, గుర్తింపులో నిర్లక్ష్యం కేసుల పెరుగుదలకు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది.

40 శాతం యువకులే

నగరంలో కరోనా ప్రభావం యువత మీదే అధికంగా కనిపిస్తోంది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా తిరగడం వల్ల.. వీరు కరోనా బారిన పడుతున్నారు. వీరి వల్ల ఇంట్లో వారికీ సోకుతోంది. నగరంలో రోడ్లపైకి వచ్చే యువతలో కనీసం 35 శాతం మంది మాస్కులు పెట్టుకోవడం లేదని పోలీసులు గుర్తించారు. కరోనా తీవ్రమవడంతో వృద్ధులు, మహిళలు, ఇతర అనారోగ్య బాధితులు చాలా వరకు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కరోనా సెకండ్‌ వేవ్‌లో నమోదవుతున్న కేసుల్లో.. 20 నుంచి 40 ఏళ్ల వయస్సు వారు 42 శాతం ఉండగా.. ఆ తర్వాత 41-50 ఏళ్లలోపు వారు 17 శాతం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

బడిలో భయం.. భయం

న్యూస్‌టుడే బృందం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. పలువురు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులూ మహమ్మారి బారిన పడుతున్నారు. దుత్తలూరు మండలంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడికి వైరస్‌ నిర్ధారణ కావడంతో.. అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సంగం మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి గురువారం కొవిడ్‌ పాజిటివ్‌గా వచ్చింది. విద్యా శాఖాధికారుల ఆదేశానుసారం ఆ బడిని మూసేశారు. శుక్రవారం పిల్లలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి ప్రతిమ తెలిపారు. చేజర్ల మండలంలోనూ ఓ ఉపాధ్యాయుడు మహమ్మారి బారిన పడ్డారు. ఇక్కడా విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరీక్షలు చేయనున్నారు. కావలి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థికి వైరస్‌ నిర్ధారణ కాగా, ఆ విద్యాలయాన్ని మూసివేశారు.

అన్ని సౌకర్యాలు కల్పిస్తాం - ప్రభాకర్‌రెడ్డి, జేసీ

కొవిడ్‌ ఆసుపత్రిలో అన్ని వసతులు ఏర్పాటు చేశాం. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించడం లేదు. జిల్లాలో అత్యధిక మందికి టీకావేశాం. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రజల్లో అవగాహన రావాలి. నిబంధనలు పక్కాగా పాటించాలి. ఏవైనా అనుమానిత లక్షణాలు ఉంటే.. పరీక్షలు చేయించుకోవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని