Published : 16/04/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిమ్మ.. కిలో రూ. 100


కాయలను గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు

గూడూరు గ్రామీణం, బాలాయపల్లి, న్యూస్‌టుడే: గూడూరు మార్కెట్‌లో గురువారం నిమ్మ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కిలో రూ. వంద పలికాయి. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమమవుతోంది. గత ఏడాది విజయదశమి తర్వాత మార్కెట్‌లో కాయలను కిలోల లెక్కన కొనుగోలు చేయడం ప్రారంభించారు. అంతకు ముందు 80 కిలోల లూజు బస్తాను కాయల నాణ్యత ప్రాతిపదికన వ్యాపారులు కొనుగోలు చేసేవారు. కిలోల విధానం వచ్చాక...లూజుకు బదులు టిక్కీ పేరుతో 50 కిలోల లోపు పట్టే గోనె సంచుల్లో రైతుల నుంచి సరకును తెప్పిస్తూ.. తూనికతో కిలో లెక్కన ధరను నిర్ణయిస్తున్నారు. ఆరంభంలో కిలో రూ. 17 నుంచి ధరలు మొదలవగా- నెలన్నర కిందట రూ. 50కి, మంగళవారం రూ. 85 పలికింది. తాజాగా కిలో రూ. వంద పలికాయి. ఎక్కువగా కిలో రూ.90 నుంచి రూ. 97 వరకు అమ్ముడుపోయాయి.

ఉత్తరాదిలో గిరాకీ పెరిగి...

తోటల్లో పక్వానికి వచ్చిన కాయలు అంతంత మాత్రంగానే ఉండగా... ఉత్తరాది రాష్ట్రాల్లో వినియోగం పెరిగింది. దీంతో గిరాకీ పెరిగి.. ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా గూడూరు నుంచి దిల్లీ, ఆగ్రా, కోల్‌కతా, ఒడిశా తదితర ప్రాంతాలకు వ్యాపారులు కాయలు ఎగుమతి చేస్తుంటారు. జిల్లాలో రెండో స్థానంలో ఉన్న పొదలకూరు మార్కెట్‌లో మాత్రం లూజు బస్తాలుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. బస్తా రూ. 6000 నుంచి రూ. 7000 వరకు ధరలు పలికినట్లు వ్యాపారుల సమాచారం. వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు గూడూరు మార్కెట్‌లకు కాయలను తీసుకువెళుతుంటారు. పొదలకూరు మార్కెట్లకు కలువాయి, చేజర్ల, సంగం తదితర మండలాల నుంచి సరకు వెళుతుంది. బాలాయపల్లి చిరు వ్యాపారులు తమిళనాడులోని వేలూరుకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. మొత్తానికి ఏప్రిల్‌ నెల నిమ్మ ధరలకు సీజన్‌ అయినా... గత ఏడాది ఆశించిన ధరలు లేక రైతులు నష్టాలు చవిచూశారు. ఇప్పుడు ధరలున్నా.. తోటల్లో దిగుబడి అంతంత మాత్రంగా ఉందన్నది సాగుదారుల మాట.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని