Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆదేశాలున్నా..అడ్డేది!

కావలి పట్టణంలోని తుమ్మలపెంట రహదారి పక్కన ఓ లేఅవుట్‌ వేశారు. దాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు పక్కనే చెరువు వద్ద ఉన్న శ్మశాన వాటికనూ ఆక్రమించారు. చదును చేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు.

నుడా పరిధిలో వెంకటాచలం మండలంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 30 ఎకరాల్లో లేఅవుట్‌ వేశారు. దానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. సంబంధిత సర్వే నంబర్లలోని భూమిని రిజిస్ట్రేషన్‌ చేయకూడదని అధికారులకు సూచిస్తూ డీటీసీపీ నుంచి ఉత్తర్వులు అందినా పరిస్థితి మారలేదు. ఇక్కడి ప్లాట్లకు ఎలాంటి అనుమతులు లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లకు అండగా నిలుస్తూ.. ప్రభుత్వానికి రావాల్సిన రూ. కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారు కొందరు. పట్టణ ప్రాంతాల్లో అక్రమంగా వెలిసిన లేఅవుట్లను, భవన నిర్మాణాలను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని డీటీసీపీ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) నుంచి వచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఇష్టానుసారం రిజిస్ట్రేషన్లు చేస్తూ.. నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఫలితంగా ఆ స్థలాలను కొనుగోలు చేసిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: కావలి, న్యూస్‌టుడే

జిల్లాలోని నెల్లూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకకూరు తదితర పట్టణాల్లో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తుండగా- ఎట్టకేలకు దృష్టి సారించిన ప్రభుత్వం... వాటి వివరాలు సేకరించింది. కొనుగోలుదారులతో పాటు వ్యాపారులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎల్‌ఆర్‌ఎస్‌(అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) తీసుకొచ్చింది. దీనికి దరఖాస్తు చేసుకున్న వారు మార్కెట్‌ విలువలో ఏడు శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ పథకాన్ని పలుమార్లు పొడిగించినా... ఆశించినంతగా దరఖాస్తులు రాకపోవడంతో అనధికార లేఅవుట్ల రిజిస్ట్రేషన్‌ నిలుపుదల చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం నుంచి జిల్లా రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో వేల ఎకరాల్లో విస్తరించిన అనధికార లేఅవుట్ల వివరాలు, మండలం, గ్రామం, సర్వే నంబర్ల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కానీ, ఇవేమీ పట్టని కొందరు అధికారులు... కాసుల యావలో పడి చట్టాన్ని చుట్టంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

1914.56 ఎకరాల్లో 283 అనధికార లేఅవుట్లు

అనుమతి ఉన్న లేఅవుట్లలో పది శాతం రిజర్వు స్థలంలో పిల్లలు ఆడుకునేందుకు పార్కు ఏర్పాటు చేయాలి. రహదారుల అభివృద్ధికి కనీసం 40 అడుగుల తారు రోడ్డు వేయాలి. డ్రైనేజీల నిర్మాణం.. మురుగు నీరు ఫిల్టర్‌ బెడ్‌ ద్వారా బయటకు వెళ్లే ఏర్పాటు ఉండాలి. విద్యుద్దీకరణ తప్పనిసరి. లేఅవుట్‌లో రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచేలా స్థలం ఉండాలి. ఇవికాకుండా పలు అనుమతులు సాధించాలి. కానీ, ఇవేమీ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. అసలు అనుమతులే లేకుండా అమ్మకాలు సాగించేస్తున్న లేఅవుట్లకు కొదవే లేదు. నుడా పరిధిలో 339.32 ఎకరాల్లో 27 అనధికార లేఅవుట్లు ఉండగా... జిల్లాలోని మిగిలిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 1575.24 ఎకరాల్లో 256 ఉన్నాయి. వీటికి సంబంధించిన నిబంధనలు తెలియక కొందరు.. తెలిసినా తక్కువ ధర అని మరికొందరు ఆశతో కొనుగోలు చేసి.. ఆనక ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు రాక... బ్యాంకు రుణాలివ్వక, విద్యుత్తు సౌకర్యం కల్పించేవారు కానరాక గగ్గోలు పెడుతున్న వారు కోకొల్లలు. ఈ విషయం నుడాలోని అధికారులందరికీ తెలిసినా.. నామమాత్రపు దాడులతో సరిపెడుతుండగా... వెనుక సవాలక్ష కారణాలున్నట్లు, కొందరు దస్తావేజు లేఖరులూ ఈ వ్యవహారాల్లో దళారి పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఆన్‌లైన్‌లో వివరాలు పంపించాం

- మునిశంకరయ్య, రిజిస్ట్రార్‌, నెల్లూరు జిల్లా

నిబంధనలు ఉల్లంఘించి ఏర్పాటు చేసిన లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయకూడదని డీటీసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందిన మాట వాస్తవమే. ఆ వివరాలను జిల్లాలోని 19 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకూ ఆన్‌లైన్‌లో పంపించాం. ఆ భూములు రిజిస్ట్రేషన్‌ చేయకుండా చూస్తున్నాం. ఎక్కడైనా జరిగితే తగిన చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని