
వలస కార్మికులకు విముక్తి
కార్మికులతో చర్చిస్తున్న అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు
చేజర్ల, న్యూస్‌టుడే : ఇటుక బట్టీల్లో వెట్టిచాకిరీ చేస్తున్న తొమ్మిది మంది వలస కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మేస్త్రీ చేజర్ల మండలంలోని పుట్టుపల్లిలో ఇటుక బట్టీల తయారీదారుడి నుంచి రూ.మూడు లక్షలు తీసుకొని తొమ్మిది మంది కూలీలను పనికి పంపాడు. ఆ సొమ్మును కార్మికులకు గాని, వారి కుటుంబ సభ్యులకు గాని అందించలేదు. దీనిపై మేస్త్రీని అడిగేందుకు ప్రయత్నించగా.. ఆచూకీ తెలియకుండా పోయింది. పనులు చేశారన్న కారణంగా ఇటుకల యజమానులు కూలీలకు మరో రూ.లక్ష చెల్లించారు. తమ వారు వెట్టిచాకిరీలో చిక్కుకొన్నారని కార్మికుల కుటుంబసభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కార్మిక శాఖ అధికారి హరిబాబు, చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఇటుక బట్టీలను సందర్శించారు. కార్మికులను వెంటనే వారి ఇళ్లకు పంపాలని యజమానులకు సూచించారు. ఒక్కో కార్మికునికి రూ.2000, రైలు టిక్కెట్ అందించి ఈ నెల 28న సొంత రాష్ట్రానికి పంపనున్నారు.