Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిండినా..నీరేదన్నా!

అధికారుల అలసత్వంతో వృథాగా జలాలు

న్యూస్‌టుడే, వరికుంటపాడు

కంపచెట్లతో పూడిపోయిన కుడి కాలువ

వరుణదేవుడు కరునించకపోతాడా.. చినుకు రాలకపోతుందా అని ఎదురుచూసిన అన్నదాత ప్రస్తుతం ఒకవైపు ఆనందం, మరోవైపు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు- ప్రకాశం జిల్లాల వరప్రసాదిని నక్కలగండి జలాశయం వర్షపునీటితో జలకళను సంతరించుకొన్నా.. వినియోగంలోకి అయోయానికి గురవుతున్నారు. నీరు రాక ఇన్నాళ్లు వేదన చెందామని, ఇప్పుడు పుష్కలంగా అందుబాటులో ఉన్నా చెంతకు చేరట్లేదని వాపోతున్నారు. కొన్నిచోట్ల కాలువలు కనుమరుగు కాగా.. ఇంకొన్ని ప్రాంతాల్లో నీరు వృథాగా పోతోంది.

గతంలో తగినన్ని వర్షాలు పడక నక్కలగండి జలాశయం పరిధిలోని భూములన్నీ బీళ్లుగా మారిపోయాయి. ఈ తరుణంలో మూడేళ్ల క్రితం సమృద్ధిగా వానలు పడటంతో కొంతమేర పంటలు పండాయి. అనంతరం చినుకు జాడ లేక మళ్లీ పొలాలు ఎండుముఖం పట్టాయి. అయితే గతేడాది మంచి వర్షాలు పడటంతో జలాశయం పూర్తిగా నిండి అలుగు పారింది. కానీ ఆ నీరు పొలాలకు చేరక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తూము షట్టర్‌ కిందకు దించకపోవడంతో జలాశయంలో నీరంతా వృథాగా పోతోంది. దీంతో జలాశయంలో నీరుందని ఆనందంలో ఉన్న రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి.

అధ్వానంగా కాలువలు..

వర్షం పడి జలాశయం అలుగుపారడంతో రైతులు బీడు భూములను సైతం సాగులోకి తీసుకురావడంతో భూములన్నీ పంటలతో కళకళలాడాయి. ఈ ఏడాది కూడా పంటలు పండుతాయని ఆనందపడ్డారు. కానీ వర్షపునీరు వృథాగా పోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అధికారుల అలసత్వం కారణంగా నీరు ప్రవహించాల్సిన కాలువలు కంపచెట్లతో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు కనుమరుగైపోయాయి కూడా. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో గొట్టపు బావుల మీద ఆధారపడాల్సి వస్తోంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని, కాలువలకు మరమ్మతులు చేపట్టి చివరి భూములకు సైతం నీరందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

8 గ్రామాలకు ఆయువుపట్టు..

జలాశయం కుడికాలువ ద్వారా వరికుంటపాడు మండలం వేంపాడు, వెంగమాంబాపురం, కాకొల్లువారిపల్లె, రామాపురం, తిమ్మారెడ్డిపల్లె, టి.కొండారెడ్డిపల్లె గ్రామాల్లోని సుమారు 1,000 ఎకరాలకు, ఎడమకాలువ ద్వారా ప్రకాశం జిల్లా పామూరు మండలం కోడిగుడ్లపాడు, జంగాలపల్లె గ్రామాల్లోని 200 ఎకరాలకు సాగు నీరు అందేలా 1954లో దీన్ని నిర్మించారు. 1989లో వచ్చిన పెను తుపానుకు కట్ట తెగిపోయి ఏడేళ్లపాటు ఆయకట్టు పరిధిలోని భూములన్నీ బీళ్లుగా మారాయి. 1996లో రూ.2కోట్లతో కట్టకు మరమ్మతులు చేసి జలాశయాన్ని యథావిధిగా నిర్మాణం చేశారు. అప్పటి నుంచి సుమారు 15 ఏళ్లపాటు సాగునీరు అందడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడంతో మళ్లీ డీలా పడిపోయారు.

చివరి ఆయకట్టుకూ నీరందిస్తాం

- కె.శివ, ఏఈ, నక్కలగండి ప్రాజెక్టు

కాలువలు పూడిపోయిన విషయం మా దృష్టికి వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు నిండింది. కాలువల దుస్థితిని ఆత్మకూరు ఈఈ శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్తాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని