Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శెభాష్‌.. సాజీద్‌

క్రికెట్‌, అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న యువకుడు

న్యూస్‌టుడే, కోట

చిన్నతనం నుంచి క్రికెట్‌, హాకీ, అథ్లెటిక్స్‌, కబడ్డీ తదితర క్రీడలంటే ఎంతో ఆసక్తి.. ఈక్రమంలోనే ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో శిక్షణ పొందారు. పతకాలు, ప్రశంసలు అందుకొన్నారు. ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత విద్యుత్తుశాఖలో ఉద్యోగంలో చేరారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యుత్తుశాఖ తరపున ఆడుతూ పతకాలు, కప్పులు అందుకొంటూ శెభాష్‌ అనిపించుకొంటున్నారు కోటకు చెందిన విద్యానగర్‌ విద్యుత్తు ఉపకేంద్రంలో పని చేసే సాజీద్‌బాషా.

బ్యాట్‌ పట్టి..

కోటకు చెందిన సాజీద్‌బాషా తల్లిదండ్రులు మధ్య తరగతి కుటుంబీకులు. చిన్న వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. సాజీద్‌బాషాకు చిన్న తనం నుంచి క్రీడలు అంటే ప్రాణం. ఒక పక్క చదువుతూనే మరో వైపు ఖాళీ సమయాల్లో క్రికెట్‌ క్లబ్‌లో క్రీడాకారుడిగా ఓనమాలు దిద్దుకొన్నారు. మంచి బ్యాట్స్‌మెన్‌, కీపర్‌గా పేరు తెచ్చుకొన్నారు.

ప్రత్యేక శిక్షణ

వ్యాయామ అధ్యాపకుడు సంధానీబాషా ఆధ్వర్యాన అథ్లెటిక్స్‌లోనూ శిక్షణ పొందారు. ఎక్కడ క్రీడలు జరిగినా నేను సైతం అంటూ పోటీ పడే వారు. క్రికెట్‌, కబడ్డీ, హాకీ తదితర క్రీడల్లో రాణిస్తూ పతకాలు సాధించారు. 2003లో విద్యుత్తుశాఖలో ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి కూడా విద్యుత్తుశాఖ తరపున పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు.

టీ20 జట్లకు ఎంపిక..

గూడూరు డివిజన్‌ నుంచి రాష్ట్ర టీ20 జట్టుకు మూడు పర్యాయాలు ఎంపికై ఏపీ జట్టు గెలుపునకు శ్రమించారు. అదే విధంగా హాకీ, కబడ్డీలోను రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి శెభాష్‌ అనిపించుకొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలు నిర్వహించడమే కాకుండా ప్రత్యేక శిక్షణ కూడా ఉచితంగా ఇస్తూ ఆదర్శంగా నిలిచారు.

కాకినాడలో జరిగిన హాకీ పోటీల్లో

ప్రథమస్థానం సాధించి క్రీడాకారులతో సాజిద్‌

విజయపరంపర

2007 నుంచి 2018 వరకు టి20 విభాగంలో కర్ణాటక, మహరాష్ట్ర, యూపీ జట్లతో జరిగిన క్రికెట్‌ పోటీల్లో ప్రతిభ చూపి విజయం పొందేందుకు నిరంతర సైనికుడిలా శ్రమించారు. ● 2020లో ఎమ్మెల్సీ మాస్టర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్లల్లో నాలుగు శతకాలు, నాలుగు మ్యాచ్‌ల్లో నాట్‌ నాటౌట్లుగా నిలిచి ప్రతిభ చూపారు. బెస్ట్‌ ఫ్లెయిర్‌గా, కీపరుగా అవార్డులను అందుకొన్నారు. ● 2018-19లో కాకినాడలో జరిగిన హాకీ పోటీల్లో జిల్లా తరఫున ఆడి 14 గోల్స్‌ చేసి ఉత్తమ క్రీడాకారుడి అవార్డును సైతం అందుకొన్నారు. ● 2019లో రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో జరిగిన హాకీ పోటీల్లో జిల్లాను రెండో స్థానంలో నిలబెట్టారు. ● 2019లో విజయవాడ ఇబ్రహీమ్‌పట్నంలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకొన్నారు. ● అథ్లెటిక్స్‌ల్లో ప్రతిభ చూపి విద్యుత్తుశాఖ ద్వారా 2019లో ఘన సత్కారాలు పొందారు.

జాతీయ జట్టులో స్థానమే లక్ష్యం: సాజీద్‌బాషా, క్రీడాకారుడు, కోట

క్రికెట్‌లోను, హాకీలోను జాతీయ జట్టులో స్థానం సాధించాలన్నదే లక్ష్యం. క్రికెట్‌, హాకీ, కబడ్డీ పోటీల్లో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తూ సాధన చేస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లోను క్రీడాకారులకు స్వచ్ఛందంగా శిక్షణ ఇస్తూ ప్రోత్సాహం అందిస్తున్నా. ఆత్మ విశ్వాసంతోపాటు పట్టుదల, క్రమశిక్షణ ఉంటే క్రీడల్లో రాణించేందుకు అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని