Published : 24/02/2021 02:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తీరం..సుజల సారం

నిర్లవణీకరణ కేంద్రం (నమూనా)

‘ప్రాజెక్టు సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు, జలవనరులశాఖ కార్యదర్శిని సభ్యులుగా నియమించారు. కేంద్ర పునరుత్పాదక విద్యుత్తుశాఖ, పారిశుద్ధ్యశాఖ అదనపు సలహాదారు, ప్రధాని ఆర్థిక సలహా మండలి సీనియర్‌ సలహాదారు కె.రాజేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు.’

ముత్తుకూరు, న్యూస్‌టుడే

భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్న ఫలితం ఇప్పటికే అనుభవిస్తుండగా- రానున్న రోజుల్లో మంచినీటి కొరత మరింత తీవ్రం కానుందన్నది అధ్యయనాల మాట. అందుకే, ప్రభుత్వాలు తగిన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాయి. ఆ క్రమంలో ఉప్పునీటిని మంచినీటిగా మార్చే అంశం తెరపైకి రాగా- ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్లవణీకరణ (డీ శాలినేషన్‌)ను పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రతిపాదించగా- ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సూచనతో కృష్ణపట్నం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఓడరేవు దక్షిణ భాగం కోట మండలం కొత్తపట్నం ప్రాంతాన్ని ఇందుకు ఎంచుకున్నారు.

పరిశ్రమలకు ప్రయోజనం

ఈ ప్రాజెక్టుతో కృష్ణపట్నం ఓడరేవు అనుబంధ పరిశ్రమలకు ప్రయోజనం కలగనుంది. థర్మల్‌ కేంద్రాల్లో బాయిలర్లకు ప్రస్తుతం ఉప్పు నీటిని వినియోగిస్తుండగా.. ఆ ప్రభావం వాటి వినియోగ కాలంపై పడుతోంది. ఉప్పు నీటి స్థానంలో మంచినీరు వాడితే.. మరో పదేళ్లపాటు ప్లాంట్‌ను వినియోగించుకోవచ్చని అంచనా. పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు రానురాను తగ్గిపోతున్న మంచినీటికి ప్రత్యామ్నాయంగా.. సముద్ర జలాలను వాడుకునే వీలు కలుగుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. చెన్నై సమీప మీంజూరులోనూ ఫలితాలు సాధిస్తున్నారు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కోట మండలం కొత్తపట్నం తీర ప్రాంతంలో రూ. 150 కోట్లతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోజుకు 100 మిలియన్‌ లీటర్ల ఉప్పునీటిని మంచినీటిగా మార్చాలన్నది లక్ష్యం. ఇప్పటికే అధికారులు ప్లాంట్‌ పూర్తి నివేదిక(డీపీఆర్‌)ను ప్రభుత్వానికి అందించారు.

గ్రామాలకు తాగునీరు లభ్యం

ప్రాజెక్టు ద్వారా సమీప గ్రామాలకూ తాగునీరు లభ్యమవుతుందని అంటున్నారు. ఇప్పటికే జిల్లా తీర ప్రాంతంలో మంచినీరు అందుబాటులో లేదు. కావలి నుంచి తడ వరకు తీరంలో ఆక్వా సాగును పెద్దఎత్తున చేపట్టడంతో భూగర్భ జలం ఉప్పుగా మారింది. తీర గ్రామాలు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఆరు నెలల్లో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నది అధికార వర్గాల సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని