Published : 24/01/2021 06:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బడికెలా సారు ..బస్సులేక బేజారు

తగినన్ని బస్సులు లేక విద్యార్థుల అవస్థలు
ఆటోలు.. ఇతర వాహనాల్లో పాట్లు 
కుటుంబాలపైనా ఆర్థిక భారం

బిజ్జంపల్లి మార్గంలో ఆటో ఎక్కేందుకు  గుంపుగా విద్యార్థినులు 

పల్లెల్లో పేదింటి విద్యార్థికి ప్రయాణం భారమవుతోంది. కరోనా నేపథ్యంలో అనేక ఒడిదొడుకులకు గురైన విద్యా వ్యవస్థ.. ఇప్పుడిప్పుడే గాడిన పడుతుండగా- పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి చదువులు సాగించడం వారికి కష్టమవుతోంది. ఆర్టీసీ సౌకర్యం లేక ఆటోలు, ఇతర వాహనాల్లో నిత్యం అవస్థల ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. కరోనా భయం కొంత తగ్గిందన్న ధైర్యంతో ఉన్న తల్లిదండ్రులకు దూరంగా ఉండే పాఠశాలలు, కళాశాలలకు బిడ్డలను పంపి చదివించాలంటే అదనపు ఆర్థికభారం అవుతోంది. 
న్యూస్‌టుడే, దుత్తలూరు, ఉదయగిరి : కరోనా నేపథ్యంలో అందరి ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ముఖ్యంగా కూలి పనులు చేసుకునే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గతంలో చాలా గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినా.. అనంతర కాలంలో ఆదాయం లేదనే సాకుతో పలు మార్గాల్లో సర్వీసులను రద్దు చేసింది. దీంతో ఆయా గ్రామాల నుంచి చదువుల నిమిత్తం పట్టణాలకు వచ్చే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత ఏడాది నడిపిన మార్గాల్లోనూ ఈ ఏడాది సర్వీసులు తొలగించడం ప్రతిబంధకంగా మారింది. ప్రస్తుతం ప్రైవేటు వాహనాల్లో రెట్టింపు నగదు చెల్లిస్తున్నా ప్రమాదాలతో కూడిన ప్రయాణం తప్పడం లేదు. 

కిక్కిరిసి ఉక్కిరిబిక్కిరి...
జిల్లాల్లోని పలు మార్గాల్లో విద్యార్థులు, సాధారణ ప్రయాణికులకు కలిపి ఆర్టీసీ అధికారులు సర్వీసులు నడుపుతుండగా... అవి కిక్కిరిసి నడుస్తున్నాయి. ఒక్కోసారి కనీసం కాలు కదిపేందుకూ వీలు లేని పరిస్థితుల్లో అవస్థలు పడాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం సర్వీసు ఏర్పాటు చేశామని చెబుతున్నా.. ఆయా సర్వీసుల్లో వారి అవస్థలు పట్టించుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. 

నడిపేందుకు సిద్ధం - పీవీ శేషయ్య, ఆర్‌ఎం, నెల్లూరు
కొవిడ్‌ నేపథ్యంలో కొన్ని పల్లె వెలుగు బస్సులను నిలుపుదల చేసిన మాట వాస్తవమే. ఇప్పుడిప్పుడే వాటిని నడుపుతున్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆయా డిపోల మేనేజర్లకు విద్యార్థులు వెళ్లి సమస్యను వివరిస్తే ఏర్పాటు చేస్తారు.

ఉదయగిరి మండలం బిజ్జంపల్లి, లింగంనేనిపల్లి, దేకూరుపల్లి, జి.అయ్యవారిపల్లి, కొత్తపల్లి, బండగానపల్లి తదితర గ్రామాలకు చెందిన 40 మందికిపైగా విద్యార్థులు ఉదయగిరిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్నారు. గతంలో ఆ మార్గంలో ఆర్టీసీ సర్వీసు ఉండేది. ప్రస్తుతం బస్సు సౌకర్యం లేక నిత్యం ఆటోల్లో అవస్థల మధ్య ప్రయాణం చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి నెలకు రూ. వెయ్యి నుంచి రూ.1200 వరకు ఆటోలకు వెచ్చించాల్సి రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

బోగోలు మండలంలో ఉన్నత చదువులు చదివే విద్యార్థులు నిత్యం ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. కళాశాలకు వెళ్లే సమయంలో ఒక్కటే బస్సు ఉండటంతో..  ఇటు ప్రయాణికులు.. అటు విద్యార్థులు... అంతా కిక్కిరిసి.. కొందరు బస్సును పట్టుకుని వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఈ విషయం తెలిసినా.. మరో బస్సు అందుబాటులోకి తీసుకురాని పరిస్థితి. 
లక్ష్మీపురం నుంచి నిత్యం మండల కేంద్రం దుత్తలూరులోని ఆదర్శ పాఠశాలకు 40 మందికిపైనే విద్యార్థులు వెళుతుంటారు. గత ఏడాది వరకు ఈ మార్గంలో ఆర్టీసీ కేవలం విద్యార్థుల సౌకర్యార్థమే ప్రత్యేక బస్సు నడిపేది. ఈ ఏడాది.. అదీ గత రెండు రోజుల నుంచి కేవలం సాయంత్రం వేళ మాత్రమే నడుస్తోంది. విద్యార్థులు ఉదయాన్నే ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆ క్రమంలో అవస్థలు పడాల్సి వస్తోంది. 

నెలకు రూ. వెయ్యి వెచ్చిస్తున్నా  - పావని, కళాశాల విద్యార్థిని, బిజ్జంపల్లి, ఉదయగిరి మండలం
బిజ్జంపల్లి నుంచి ఉదయగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు వచ్చి ఇంటర్‌ చదువుతున్నా. గతంలో ఆర్టీసీˆ సర్వీసు ఉన్నప్పుడు వ΄డు నెలలకు రూ. 900 వెచ్చించి పాసు తీసుకుంటే సరిపోయేది. ప్రస్తుతం బస్సు సౌకర్యం లేదు. ఆటోలో నెలకు రూ. వెయ్యి వెచ్చించి రావాల్సి వస్తోంది. కూలి పనులు చేసుకుని పిల్లలను చదివించే తల్లిదండ్రులకు ఆర్థిక సమస్యగా ఉంటోంది. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని