Published : 24/01/2021 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రయాణ పరీక్ష..!

● ఉదయగిరిలో ఇంటర్‌ పరీక్ష కేంద్రాలు

● అదనంగా 25 కి.మీ. వెళ్లాల్సిన పరిస్థితి

● సీతారామపురం విద్యార్థుల వెతలు


డీటీకి వినతిపత్రం అందజేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు

 

న్యూస్‌టుడే, సీతారామపురం : జిల్లాలోనే మారుమూల మండలం. ప్రగతేమో దూరం.. సమస్యలేమో దగ్గర. నామమాత్రపు సౌకర్యాలు. అరకొరగా బస్సుల రాకపోకలు. వెరసి.. సీతారామపురంలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. పైగా స్థానికంగా ఇంటర్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో.. వారి వెతలు వర్ణనాతీతం. మూడు జిల్లాల సరిహద్దు కావడంతో.. మండలానికి సమీపంలోని ఇటు ప్రకాశం, అటు కడప జిల్లాలకు చెందిన విద్యార్థులు సీతారామపురంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. పరీక్ష కేంద్రాన్ని మాత్రం ఉదయగిరిలో ఏర్పాటు చేయడంతో.. ఇక్కణ్నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.

మొత్తం 411 మంది..

సీతారామపురంలో ఏపీ ఆదర్శ పాఠశాల, ఎల్వీఆర్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఆదర్శ పాఠశాలలో 116, ఎల్వీఆర్‌లో 295 చొప్పున మొత్తం 411 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రథమ సంవత్సర ప్రవేశాలు కొనసాగుతున్న తరుణంలో.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మండల కేంద్రానికి చుట్టుపక్కల 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల నుంచి విద్యార్థులు ఆయా కళాశాలలకు హాజరవుతున్నారు. వీరందరూ వార్షిక పరీక్షలు రాసేందుకు అదనంగా మరో 25 కిలోమీటర్ల దూరంలోని ఉదయగిరి వెళ్తున్నారు. ఈ లెక్కన ఒక్కో విద్యార్థి ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి రమారమి 90 నుంచి 110 కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఫలితంగా వ్యయప్రయాసలకు గురి కావడంతో పాటు.. మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నారు. పరీక్షల వేళ సీతారామపురం నుంచి ఉదయగిరి పరీక్ష కేంద్రం వరకు అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నా.. స్వగ్రామాల నుంచి సీతారామపురానికి చేరేందుకు ఉదయం వేళలో సరైన రవాణా వ్యవస్థ లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల ఆయా కళాశాలల విద్యార్థులు ఉప తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి స్థానికంగానే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇబ్బందిగా ఉంటోంది..

మాది సీతారామపురం మండలం పబ్బులేటిపల్లి. గ్రామం నుంచి సుమారు ఒకటిన్నర, రెండు కిలోమీటర్లు నడిచొచ్చి బస్సు ఎక్కుతున్నాం. ఏడు కిలోమీటర్ల దూరంలోని సీతారామపురం చేరుకుంటున్నాం. అక్కణ్నుంచి ఉదయగిరి వెళ్లేందుకు మరో 25 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో పరీక్ష కేంద్రానికి చేరుకునే లోపే అలసటకు గురవుతున్నాం. అధికారులు స్పందించి సీతారామపురంలోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి. - నందిని, జీవనవేణి, ఆదర్శ పాఠశాల విద్యార్థినులు

అదే అసలు సమస్య..

ఇంటర్‌ పరీక్షలు వస్తున్నాయంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మా గ్రామం నుంచి సీతారామపురానికి సుమారు 18 కి.మీ. ఉంటుంది. అక్కణ్నుంచి ఉదయగిరికి మరో 25 కి.మీ.. వెరసి రోజుకు 86 కి.మీ. మేర రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పరీక్ష కేంద్రానికి చేరుకోవడమే మాకు అసలు పరీక్షగా మారుతోంది. ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నాం. - లక్ష్మీప్రసన్న, భారతి, నజీమా, ఎల్వీఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థినులు

కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం..

సీతారామపురంలో ఇంటర్‌ చదివే విద్యార్థులు నియోజకవర్గ కేంద్రం ఉదయగిరికి వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తుండటం వాస్తవమే. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. కలెక్టర్‌కు విషయాన్ని తెలియజేస్తాం. ఇంటర్‌ బోర్డు అధికారుల దృష్టికీ తీసుకెళతాం. స్థానికంగానే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషి చేస్తాం. - వెంకటసునీల్‌, తహసీల్దారు, సీతారామపురం

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని