
ప్రాణం తీసిన నిద్ర మత్తు
● లారీని ఢీకొన్న కారు
● ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
లారీ కిందకు దూసుకెళ్లిన కారు
కావలి గ్రామీణం, న్యూస్టుడే: తమ కోరికలు నెరవేరితే కొండకొస్తామని మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించేందుకు కుటుంబ సమేతంగా కారులో తిరుమల బయల్దేరారు. తలనీలాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఆ మధుర స్మృతులను మదిలో పదిలపరుచుకొని.. స్వగ్రామానికి బయల్దేరారు. అంతా సవ్యంగా సాగుతున్న ఆ ప్రయాణం.. ఉన్నట్టుండి ప్రమాదానికి గురైంది. నిద్ర మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలిగొనగా.. నలుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. గ్రామీణ ఎస్సై వీర ప్రతాప్ కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వేములవాడలోని అంజనీనగర్కు చెందిన లాల దేవయ్య(56), అతని భార్య లక్ష్మి, కుమారుడు చంద్రశేఖర్, కోడలు అంజలి, కుటుంబ సభ్యురాలు వైష్ణవి ఈ నెల 19న కారులో తిరుమలకు బయల్దేరారు. స్వామివారి దర్శనానంతరం స్వగ్రామానికి పయనమయ్యారు. మార్గం మధ్యలోని సర్వాయపాలెం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగివున్న లారీని నిద్ర మత్తులో ఢీకొన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ముందు సీట్లో కూర్చున్న లాల దేవయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన నలుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన సేవల నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.