
ప్రార్థనాలయాల పరిరక్షణ అందరి బాధ్యత
ఏఎస్‌పేట: సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు
అనుమసముద్రంపేట: ప్రార్థనాలయాల పరిరక్షణ ప్రజలందరి సామాజిక బాధ్యత అని ఆత్మకూరు డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు అన్నారు. స్థానికంగా ఓ కల్యాణ మండపంలో ప్రార్థనా మందిరాల పరిరక్షణపై శాంతి కమిటీ సభ్యులు, అధికారులు, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, మహిళా పోలీసులతో శనివారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతోనే ఆలయాలు, మసీదులు, చర్చిలపై దాడులను నిరోధించవచ్చని చెప్పారు. దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సై సుభాన్ మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో శాంతి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దారు లక్ష్మీనరసింహం, ఎంపీడీవో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆలయాలు గ్రామానికి దూరంగా ఉండటం, రాత్రివేళ జన సంచారం లేకపోవడం వల్లే దాడులు జరుగుతున్నట్లు వివరించారు. ఈవోపీఆర్డీ ప్రసాద్, మండల పరిషత్తు ఏవో శ్రీనివాసరావు, ఆర్ఐ పృథ్వీ, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులున్నారు.
మర్రిపాడు: గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలను వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పర్యవేక్షిస్తుండాలని ఆత్మకూరు సీఐ సోమయ్య సూచించారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం సమావేశమయ్యారు. ఎస్సై వీరనారాయణ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే తమకు సమాచారం అందించాలని కోరారు. దేవాలయాల కమిటీ సభ్యులతో మాట్లాడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు.
సంగం: ప్రార్థనా మందిరాల రక్షణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టిందని బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌బాబు అన్నారు. స్థానిక కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ సేవాదళ్ పేరిట గ్రామాల్లో ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు చెప్పారు. వారి ఆధ్వర్యంలో ప్రార్థనా మందిరాల రక్షణకు అవసరమైన సీసీ కెమెరాలు, ఇతరత్రా వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. నాయకులు కె.వి.కరుణాకరరెడ్డి, కె.రవీంద్రరెడ్డి, గిరిబాబు, గోపీీకృష్ణయ్య, అర్చకుడు గోపాలకృష్ణమూర్తి ఉన్నారు.