
నిర్వహణ శూన్యం.. భవనాలు శిథిలం
నిర్మాణాలకు రూ.కోట్ల ఖర్చు
● ప్రజాప్రయోజనం విస్మరణ
న్యూస్టుడే, కోట : కోట మండలంలో ఉన్న ర.భ భవనాలు ఏళ్ల తరబడి శిథిలావస్థలో ఉన్నాయి. అధికారులు మరమ్మతులు చేపట్టకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కోట్లాది రూపాయల ర.భ ఆస్తులు నిర్వీర్యమవుతున్నాయి. దీంతో ప్రజా ప్రతినిధులు, తనిఖీలు, ఇతర పనులపై వచ్చే అధికారులు తదితరులు విశ్రాంతి తీసుకునేందుకు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కోటలో మూడు దశాబ్దాల కిందట ర.భ అతిథి గృహం నిర్మించారు. వివిధ పనులపై వచ్చే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకుల సమావేశాలకు అద్దెకు ఇచ్చే వారు. దీని నిర్వహణకు సిబ్బందిని కూడా నియమించారు. అయితే పదేళ్ల కిందట భవనం శ్లాబ్ దెబ్బతింది. గోడలు బీటలువారాయి. విద్యుత్తు సరఫరా ఇతర వసతులు లేకుండా పోయాయి. తాత్కాలిక మరమ్మతులతో సర్దుకొంటూ వచ్చారు. అక్కడ పని చేసే సిబ్బంది కూడా పదవివీరమణ చేశారు. ప్రస్తుతం భవనాల నిర్వహణ లేకుండా పోయాయి. భవనం పూర్తిగా మూత పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాంగణంలోని పెద్ద చెట్టు కూడా కూలిపోయింది. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు. వీరారెడ్డిసత్రం సమీపంలో నాలుగు దశాబ్దాల కిందట నిర్మించిన ర.భ సెక్షన్ ఆఫీసు భవనాలు 15 ఏళ్ల కిందట దెబ్బతిన్నాయి. గోడలు, శ్లాబ్ పూర్తిగా దెబ్బతింది. ప్రాంగణమంతా పిచ్చిచెట్లతో నిండి భయానకంగా ఉంది. శిథిలావస్థలో ఉండడంతో సెక్షన్ కార్యాలయాన్ని కోటలోని ర. భ కార్యాలయానికే మార్చేశారు. దీనిని అలాగే వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాలను మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరముంది.
మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతాం : కుమార్, ర.భ డీఈ
శిథిలావస్థలో ఉన్న ర.భ అతిథి భవనం, సెక్షన్ కార్యాలయ భవనాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైతే మరమ్మతులు చేసి భవనాలు వినియోగంలోకి తీసుకు వస్తాం. ర.భ ఆస్తులు నీర్వీరం కాకుండా నివారణ చర్యలు తీసుకొంటాం.
వీరారెడ్డిసత్రంలో సెక్షన్ కార్యాలయ భవనం