
బొమ్మలతో బోధన..బాలల్లో ఆసక్తి
● సృజనాత్మకతకు పెద్దపీట
● కొంగొత్తగా అమ్మబడుల ముస్తాబు
● నూతన విధానంతో చిన్నారులకు మేలు
వెంకటగిరి, న్యూస్టుడే : చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను సమర్థవంతంగా అందించేందుకు కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయనున్నారు. 3 నుంచి 4 సంవత్సరాల్లోపు చిన్నారులను పూర్వ ప్రాథమిక 1, 4 నుంచి 6 సంవత్సరాల బాలలను పూర్వ ప్రాథమిక-2 కింద విభజించి శిక్షణ ఇస్తారు. ఇందు కోసం ప్రత్యేక పాఠ్యాంశాలను అధికారులు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆట పాటలతో గడిపిన చిన్నారులు ఒకటో తరగతిలో చేరే నాటికి కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలనేది ప్రభుత్వ సంకల్పం. ఇందు కోసం బొమ్మలతో ప్రత్యేక బోధన చేస్తున్నారు.
అయిదు విభాగాలుగా అభివృద్ధి...
ఆట, మాట, పాట, కథ, సృజనాత్మకత, సంసిద్ధత అనే ఆరు కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు కార్యకర్తలు చిన్నారులకు విద్యాబోధన చేసేవారు. పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా చిన్నారుల్లో అయిదు రకాల అంశాల్లో అభివృధ్ధి తీసుకువచ్చేందుకు ప్రయత్నిసున్నారు. శారీరక, మానసిక, బాషా, సాంఘిక ప్రజ్ఞాభివృధ్ధి సాధించడం ద్వారా వారికి మంచి పునాది పడుతుందని అధికారులు తెలుపుతున్నారు.
పరిశీలన శక్తి పెరిగింది - ఉమామహేశ్వరి, సునీత, కార్యకర్తలు, వెంకటగిరి
శిక్షణలో పాల్గొని ఆసక్తిగా అనేక అంశాలను నేర్చుకున్నాం. బోధనోపకరణాలతో చిన్నారులకు మరింత సులువుగా అర్థమయ్యేలా పాఠాలను బోధించవచ్ఛు బొమ్మల ద్వారా చిన్నారుల్లో మరింత ఆసక్తి పెంచడంతో వారిలో పరిశీలన శక్తి పెరుగుతుంది. ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడింది.
అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో పూర్వ ప్రాథమిక విద్య నుంచే విద్యార్థులను సమాయత్తం చేసేందుకు అధికారులు శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఖర్చు లేకుండా బోధనోపకరణాలు తయారు చేసే విధానాన్ని సైతం నేర్పిస్తున్నారు.. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ఆయా కేంద్రాల కార్యకర్తలకు ఉపకరణాల తయారీపై ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్నారు. కొద్దిపాటి సామగ్రితో ఆకర్షణీయంగా ఉపకరణాలను తయారు చేయడంలో ఎవరికి వారే ప్రతిభ చూపుతున్నారు. సీడీపీవోలు, సూపర్వైజర్ల ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణలో అంగన్వాడీ కార్యకర్తల్లో సృజనాత్మకతకు పదును పెట్టించి పిల్లలకు ఆధునిక విద్యాబోధన చేయించనున్నారు.
ఆకర్షణీయ బోధన - జ్యోతి, సీడీపీవో, ఉమామహేశ్వరి, సూపర్వైజర్, వెంకటగిరి
చిన్నారులకు బొమ్మలతో ఆకర్షణీయంగా విద్యాబోధన అందనుంది. అంగన్వాడీ కార్యకర్తల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ఉపకరణాల ద్వారా చిన్నారులను ఆకట్టుకునేలా విద్యాబోధన అందిస్తారు. ప్రధానంగా బోధన శైలిని మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి ప్రయత్నం మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. కార్యకర్తలు ఎవరికి వారే బొమ్మలు తయారు చేస్తున్నారు.
కార్యకర్తలకు సూచనలు చేస్తున్న ఐసీడీఎస్ అధికారిణి జ్యోతి