
మానిoటి జాబిల్లి
బాల్య వివాహాల అడ్డుకట్ట ●
పెరుగుతున్న బాలికల శాతం
నేడు జాతీయ బాలికా దినోత్సవం
నెల్లూరు నగరానికి చెందిన ఓ బాలికకు వివాహం చేస్తుండగా- అధికారులు అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వివాహ వయస్సు వచ్చే వరకూ ఆ జోలికి వెళ్లబోమని రాతపూర్వకంగా తీసుకున్నారు. నాటి బాలిక... ప్రస్తుతం ఉన్నత చదువులు అభ్యసిస్తోంది.
న్యూస్‌టుడే, నెల్లూరు(సంక్షేమం) : బాల్య వివాహాలను అడ్డుకోవడంలో ఐసీడీఎస్ అధికారులు కొంత సఫలీకృతమవుతున్నారు. గత అయిదేళ్లలో 332 బాల్య వివాహాలను నిలుపుదల చేశారు. కొందరు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. 37 మంది బాలికలను హోమ్‌లకు తరలించారు. బేటీ బచావో- బేటీ పడావో పథకం కింద ‘బాలికలను రక్షించాలి- చదివించాలి’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. వంద రోజుల కార్యచరణ రూపొందించి.. 755 మంది మహిళలకు అవగాహన కల్పించారు. ఆడ పిల్లలు పుట్టిన దంపతులను సన్మానించడంతో పాటు బేబీ కిట్లు ఇవ్వడం, అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వాడవాడలా అవగాహన ప్రదర్శనలు చేపడుతున్నారు.
కిశోరి వికాసంతో.. లింగ వివక్ష, విద్యావకాశాల్లో వెనుకబాటు, హింస, లైంగిక దాడులు, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, అనారోగ్య సమస్యలు, రక్తహీనత, పోషకాహార లోపం.. ఇలా ప్రతి దశలో ఏదో రూపంలో బాలికలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేందుకు ప్రభుత్వం స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘కిశోరి వికాసం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా బాలికలకు గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ తదితరాలపై అవగాహన కల్పిస్తోంది. ఉత్సాహవంతులైన బాలికలకు శిక్షణ కల్పించి, వారి ద్వారా పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్ కారణంగా గత ఏడాది కార్యక్రమంలో జాప్యం చోటుచేసుకుంది. నిరాశ్రయ, అనాథ బాలికల కోసం నెల్లూరు, గూడూరు, కోట, వెంకటగిరి, సూళ్లూరుపేటలో బాల సదనాలు ఉండగా, వీటిలో ప్రస్తుతం 30 మంది చొప్పున బాలికలు ఆశ్రయం పొందుతుండగా.. మరో 22 ప్రైవేట్ హోమ్‌లు నడుస్తున్నాయి.
అలా చేస్తే చర్యలు
బాల్య వివాహాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. పెళ్లి చేసిన తల్లిదండ్రులు, హాజరైన బంధుమిత్రులు, పురోహితులూ శిక్షార్హులే. ఇందుకు డివిజనల్ స్థాయిలో పురోహితులు, ఖాజీలు, కల్యాణ మండపాల నిర్వాహకులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఎక్కడైనా వివాహాలు జరిగినా, అక్రమ రవాణా జరిగినా 181, 1098, 121 హెల్ప్‌లైన్ నంబర్లుకు సమాచారం ఇవ్వాలి. - ఉమాదేవి, పీడీ, ఐసీడీఎస్