
అంతటాస్తబ్దత!
మోగిన పల్లె నగరా
గుంభనంగా అధికారులు
న్యూస్‌టుడే, నెల్లూరు (జడ్పీ), గూడూరు పట్టణం : జిల్లాలోని 46 మండలాలను ఎన్నికల నిర్వహణ నిమిత్తం నాలుగు విభాగాలుగా విభజించారు. దశల వారీగా వీటిల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం.. ఏ మండలంలో ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్నీ స్వయంగా ప్రకటించింది. ఇంకోవైపు జిల్లా వ్యాప్తంగా 946 పంచాయతీల్లో ఎన్నికలు జరిపేందుకు గత ఏడాది మార్చిలోనే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల కసరత్తు, బ్యాలెట్ పెట్టెలు సిద్ధం చేయడం.. బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితరాలన్నీ అప్పట్లోనే పూర్తయ్యాయి. కానీ, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలను నిలిపివేశారు. తాజాగా అనేక పరిణామాల నేపథ్యంలో శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన జారీ చేసింది. గతంలో చేపట్టిన ఎన్నికల ప్రక్రియను మొత్తం తిరిగి సిద్ధం చేసుకోవాలని కమిషన్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. నియమావళి అమల్లోకి వచ్చిందని, అధికారులు వాటిని సమర్థంగా అమలు చేయాలని ఉత్తర్వులు అందాయి.
ఆచితూచి అడుగులు
నోటిఫికేషన్ విడుదలైనా జిల్లా అధికార యంత్రాంగంలో ఎలాంటి కదలిక లేదు. ఈ సారి ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఎన్నికల సంఘం, రాష్ట్ర పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. దీంతో సాయంత్రం వరకు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇతర జిల్లాల అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తమ పరిధిలో ఏమీ లేదంటూ కలెక్టర్, రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు అందరం పని చేస్తామని జేసీ ప్రభాకర్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ఎన్నికల సంఘం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కూ జిల్లా ముఖ్య అధికారులు హాజరుకాలేదు. జిల్లా పంచాయతీరాజ్ సిబ్బంది కూడా రాష్ట్ర ఉద్యోగ సంఘ నిర్ణయం మేరకే అడుగులు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద సోమవారం వరకు ఈ ఉత్కంఠ తప్పేలా లేదు. ఎన్నికలు సాగేనా.. ఆగేనా అన్న విషయంపై రచ్చబండలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.