Updated : 20/01/2021 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అడుగుపెట్టి. కొలువుపట్టి

160 మందికి పశు వైద్య సహాయకుల పోస్టులు

దగదర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఘనత

ఆ కళాశాలలో చేరితే కొలువుల ఒడిలోకి అడుగుపెట్టినట్లే. అక్కడి వాతావరణం ప్రభుత్వ ఉద్యోగం సాధించేంతవరకు నిద్రపోనివ్వదు. ఎందరినో విద్యావంతులుగా, మరెందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దిందా కళాశాల. సరస్వతి పుత్రులకు జీవనాన్ని ఇస్తూ ప్రభుత్వ కొలువుల కార్ఖానాగా మారింది. ఎప్పటికప్పుడు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునిక కోర్సులను అందిపుచ్చుకుంటూ దినదినాభివృద్ధి చెందుతోంది దగదర్తిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల. ఇటీవల అక్కడి 160 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం విశేషం. ఆ సంగతులేంటో ఓ సారి చదివేద్దాం.

●●●న్యూస్‌టుడే, దగదర్తి : దగదర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రభుత్వ ఉద్యోగాలకు కార్ఖానాగా మారింది. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సచివాలయాలు విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాయి. కళాశాలలో కొన్ని ప్రత్యేకమైన కోర్సులతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిల్లో లైవ్‌ స్టాక్‌ మేనేజ్‌మెంటు డెయిరీయింగ్‌ కోర్సు ఒకటి. కళాశాలలో ఇప్పటివరకూ 189 మంది ఈ కోర్సు చదివి ఉత్తీర్ణులయ్యారు. అందులో 160 మంది విద్యార్థులు ఇటీవల పశువైద్య సహాయకుల ఉద్యోగాలు సాధించడం విశేషం.

అధ్యాపకుల కృషితోనే..

దగదర్తిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను 2001లో ప్రారంభించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటైన ఈ కళాశాలలో మొదట్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులుండేవి. తర్వాత కళాశాలకు స్థలంతో పాటు భవన వసతి కల్పించారు. అప్పటి కళాశాల ప్రిన్సిపల్‌ మాణిక్యరావు భవిష్యత్తు అవసరాలను గుర్తించి లైవ్‌ స్టాక్‌ మేనేజ్‌మెంటు, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల కోసం ఇంటర్మీడియ్‌ బోర్డుకు విన్నవించడంతో 2011లో మంజూరు చేశారు. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుకు తగిన వసతులు లేక విద్యార్థులు చేరకపోవడంతో దాన్ని తొలగించి డెయిరీ కోర్సును కొనసాగించారు. ఇప్పటివరకు 189 మంది ఈ కోర్సు పూర్తి చేశారు. మరో 30 మందికి ఈ సంవత్సరంతో కోర్సు పూర్తవుతుంది.

సకల సౌకర్యాలు..

అధ్యాపకుడు లవకుమార్‌ కృషితో విద్యార్థులు ఈ కోర్సుపై ఆసక్తి చూపారు. ఇప్పటివరకు 8 బ్యాచ్‌ల విద్యార్థులు బయటకు వచ్చారు. వారిలో 160మంది ఇటీవల సచివాలయాల్లో పశువైద్య సహాయకులుగా కొలువులు సాధించారు. విద్యార్థి చేరిన దగ్గరినుంచి వారి ఉన్నతికి ఇక్కడి అధ్యాపకులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఏ కోర్సు చేస్తే ఎలాంటి అవకాశాలున్నాయన్న దానిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. కళాశాలలో కొలువు సాధనకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నారు. దానికి విద్యార్థి కష్టపడేతత్వం కూడా తోడవడంతో మంచి ఫలితాలు దక్కాయి.

ఎంతో ఆనందంగా ఉంది : ప్రసాదరావు, ప్రిన్సిపాల్‌

కళాశాలలో డెయిరీయింగ్‌ కోర్సు చదివిన 160 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాలతో వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక్కడి కళాశాలకు ప్రభుత్వం అన్ని వసతులతో నూతన భవనం నిర్మించింది. కొవిడ్‌తో చాలామంది కార్పొరేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇక్కడ చేరారు. ఈ సంవత్సరం డెయిరీయింగ్‌ కోర్సుకు డిమాండ్‌ పెరగడంతో ఇప్పటికే ఆన్‌లైన్‌లో 200 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

ఉజ్వల భవిష్యత్తు : లవకుమార్‌, కోర్సు అధ్యాపకుడు

విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1988 నుంచి ఈ కోర్సు ఉంది. దగదర్తి జూనియర్‌ కళాశాలలో కొత్తగా ఏర్పాటు చేశారు. మొదట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపారు. మండలంలోని అన్ని గ్రామాలు తిరిగి కోర్సు ప్రాముఖ్యతను వారికి వివరించడంతో చేరికలు పెరిగాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకాలను నిలబెట్టుకుంటూ సాగుతున్నాం.

 

కలలో కూడా ఊహించలేదు : రాజేష్‌, పశువైద్య సహాయకులు

కళాశాల అధ్యాపకుల కృషితో 2014-16లో కోర్సు పూర్తి చేశాను. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నాకు అదే ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఉన్నత చదువులు చదివిన ఎంతో మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటు చేసి మాకీ అవకాశం కల్పించడం సంతోషం. ప్రస్తుతం బోగోలు మండలంలోని ఎస్వీపాళెం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నా.

అరుదైన అవకాశం : కల్పన, పశువైద్య సహాయకురాలు

మాది నిరుపేద కుటుంబం. కార్పొరేటు విద్యాసంస్థలో చేరే స్థోమత లేక దగదర్తి జూనియర్‌ కళాశాలలో 2011-2013లో ఈ కోర్సు చదివా. ముత్తుకూరు మండలంలోని తాళ్లపూడి సచివాలయంలో ప్రస్తుతం ప్రభుత్వ పశువైద్య సహాయకురాలిగా ఉద్యోగం చేస్తున్నా. ఇక్కడి అధ్యాపకులు ఎంతో ప్రోత్సాహం అందిస్తూ మమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని