
అధిక రుసుము వసూళ్లపై ఫిర్యాదు
వెంకటాచలం, న్యూస్టుడే: జిల్లాలోని కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు వీఎస్యూ నిర్ణయించిన పరీక్ష రుసుము కంటే రెండుమూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపించారు. నెల్లూరు నగరంలోని వేర్వేరు కళాశాలలకు చెందిన విద్యార్థులు మంగళవారం విశ్వవిద్యాలయానికొచ్చి రిజిస్ట్రార్ ఎల్.విజయ్కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. వీఎస్యూ రూ.700 నిర్ణయించగా.. ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రం వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కళాశాలలపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రార్ స్పందిస్తూ.. విశ్వవిద్యాలయం నిర్ణయించిన మేరకు మాత్రమే రుసుము వసూలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఫిర్యాదులపై పరీక్షల నిర్వహణాధికారితో చర్చించామని, ఇకపై ఆన్లైన్లోనే రుసుము చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
Tags :