
ఎమ్మెల్యేపై దేశ ద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు?
ప్రసన్న వ్యాఖ్యలపై పోలంరెడ్డి మండిపాటు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: ‘నువ్వు ఎక్కణ్నుంచి వచ్చావు.. నేను తలచుకుంటే నిన్నేమైనా చేస్తానంటూ’ ఓ ఐపీఎస్‌ను బెదిరించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిపై దేశ ద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తొలుత మనందరం భారతీయులమని.. ఆ తరువాతే ఆంధ్రులు, బిహారీలన్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలని సూచించారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రసన్నకుమార్‌రెడ్డి వద్ద చట్టాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాయకులు ఎంవీ శేషయ్య, ప్రభాకర్‌రెడ్డి, తాళ్ల స్వామి, చైతన్య హరినాథ్, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.
సుమోటో కేసు నమోదు చేయాలి: భాజపా
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని భాజపా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు జి.భరత్‌కుమార్‌యాదవ్ డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం హయాంలో అధికార యంత్రాంగంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. హిందూ దేవాలయాలు, ఆస్తులు, విగ్రహాలపై దాడులు, ప్రశ్నించిన సోషల్‌మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. నాయకులు విజయ్‌కుమార్, రాధాకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.