
నకిలీ ఖాతా సృష్టించి..!
పొదలకూరులో సైబర్ మోసం
పొదలకూరు, న్యూస్‌టుడే: సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం సామాజిక మాధ్యమాన్ని వేదికగా మార్చుకున్నాడు. ఉపాధ్యాయుడి పేరిట నకిలీ ఖాతా సృష్టించి మోసానికి పాల్పడిన సంఘటన పొదలకూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ గంగాధర్‌రావు కథనం మేరకు.. పట్టణానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి పేరిట సైబర్ మోసగాడు నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని.. ఐసీయూలో ఉన్నానని.. కొంత నగదు కావాలంటూ పోస్టు పెట్టడంతో పాటు ఓ ఫోన్ నంబరును జోడించారు. ఈ పోస్టు నిజమేనని భావించిన ఓ వ్యక్తి ఆ నంబరుకు రూ.10 వేలు నగదు వేశారు. తాను డబ్బులు వేశానని.. ఓసారి చూడాలంటూ సదరు ఉపాధ్యాయుడికి ఫోన్ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. తన పేరిట నకిలీ ఖాతా సృష్టించినట్లు గ్రహించిన ఉపాధ్యాయుడు సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశానుసారం ఎస్సై రహీంరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.