
ఇసుక అక్రమ రవాణపై జేసీ ఆగ్రహం
స్టాక్ పాయింట్లపై నిబంధనలు
నెల్లూరు (ఇరిగేషన్), న్యూస్‌టుడే: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సంయుక్త కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రీచ్‌ల్లో అడ్డగోలు తవ్వకాలు- ఇసుక అక్రమ రవాణాపై సోమవారం ‘ఎవరక్కడ?’ శీర్షిక ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. తన ఛాంబర్లో అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన .. ఇసుక పాయింట్లపై వస్తున్న ఆరోపణలపై గనులు, ఇసుక అధికారులను వివరణ కోరగా- అక్రమ రవాణా వాస్తవమేనని, కేసులు నమోదు చేశామని వారు వివరించినట్లు సమాచారం. పెన్నా, స్వర్ణముఖి నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రీచ్‌లో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి నిఘా ఉంచాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే స్టాక్ పాయింట్లు నిర్వహించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, మంగళవారం నుంచే ఆ మేరకు మాత్రమే అమ్మకాలు జరగాలని ఏపీఎండీసీ సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత రీచ్‌ల్లో అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని, ఆ పరిస్థితి నియంత్రణకు ఇక నుంచి రాత్రివేళల్లో సిబ్బంది విధులు నిర్వహించాలని, గనులు, ఏపీఎండీసీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయాలని జేసీ ఆదేశించారు. ఆ ఆదేశాల అమలు మంగళవారం నుంచే పాటించే ప్రయత్నం జరిగింది. ఎస్ఈబీ సిబ్బంది ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.
6 రీచ్‌లకు టెండర్ల పరిశీలన : కొత్తగా పెన్నాలో ఆరు ఇసుక రీచ్‌లకు వచ్చిన టెండర్లను జేసీ నేతృత్వంలో పరిశీలించారు. అర్హులైన వారిని ఎంపిక చేసే ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. నాలుగు రీచ్‌లు, రెండు డీసిల్టింగ్ పాయింట్లకు 27 మంది దరఖాస్తు చేశారు. ఇప్పటికే కొన్నిటిని తమ పరపతితో దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజుల్లో కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేసేందుకు జేసీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ దరఖాస్తులు పరిశీలిస్తోంది.