
టీకా ప్రక్రియ ముమ్మరం
ర్యాలీలో కలెక్టర్ చక్రధర్‌బాబు, జేసీలు
నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్ టీకా ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. మంగళవారం 32 సెషన్స్ కేంద్రాల్లో ప్రక్రియను కొనసాగించారు. అన్ని కేంద్రాల్లో కలిపి 2059 మందికి టీకా వేసినట్లు డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి తెలిపారు. మొదటి సారి వేయించుకున్న వారు తిరిగి 28 రోజులకు టీకా వేయించుకోవాలని సూచించారు.
ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలకు... : జిల్లాలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు వ్యాక్సిన్ పొందారు. ఇందుకూరుపేట మండలం జగదేవిపేట పీహెచ్సీలో ఓ అంగన్వాడీ కార్యకర్త టీకా పొందిన కొద్దిసేపటికే తల తిరుగుతోందని చెప్పారు. దాంతో ఆమెను 108 వాహనంలో జీజీహెచ్ అత్యవసర విభాగానికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్సను అందించి ఐపీ బ్లాక్‌లోని ఏఈఎఫ్ఐ విభాగానికి తరలించారు. ముత్తుకూరు మండలానికి చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్తకు సైతం కళ్లు తిరగడంతో జీజీహెచ్‌కు తీసుకువచ్చి చికిత్స అందించారు.
అయిదు వేల మందికి పూర్తి
నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లాలో ఇప్పటి వరకు అయిదు వేల మందికి టీకా వేసినట్లు కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. నగరంలోని గాంధీబొమ్మ కూడలి వద్ద వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జేసీ(అభివృద్ధి) ఆధ్వర్యంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి కొవిడ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. వాటి ముగింపును పురస్కరించుకుని కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు.