
తనను తాను మరిచి.. ప్రాణం విడిచి..
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రైలు పట్టాలపై పనులు
గూడ్స్ ఢీకొని యువకుడి దుర్మరణం
రాపూరు, న్యూస్టుడే: సాంకేతికతతో ఎన్ని సత్ఫలితాలున్నాయో.. వినియోగించే తీరును బట్టి అదే స్థాయిలో దుష్పరిణామాలున్నాయి. అసలే రైలు పట్టాలపై ప్రమాదకర పని.. ఆపై ఇయర్స్ ఫోన్ పెట్టుకున్నారు. రైళ్లు వచ్చేది.. పోయేది కూడా తెలియని స్థితిలో తనను తాను మరిచి.. పాటలు వింటూ పనుల్లో నిమగ్నమయ్యారు. కనీసం పట్టాలపై గూడ్స్ వచ్చే శబ్దాన్ని కూడా వినలేని స్థితిలో.. దానికిందే పడి యువకుడు దుర్మరణం చెందిన సంఘటన రాపూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మనుబోలు మండలం చెర్లోపల్లికి చెందిన రామకృష్ణ(21) కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాపూరులో రైలు పట్టాల వద్ద కంకర పోసే పని కుదిరింది. ఎనిమిది నెలల కుమార్తెను ముద్దాడి.. భార్యకు జాగ్రత్తలు చెప్పి బయల్దేరారు. తోటి కూలీలతో కలిసి పని ప్రదేశానికి చేరుకున్నారు. రామకృష్ణ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ పని చేయసాగారు. మధ్యాహ్నం రాపూరు వైపు గూడ్స్ వస్తుండగా.. సహచర కూలీలందరూ పట్టాలకు దూరంగా తప్పుకొన్నారు. ఇయర్ ఫోన్స్ కారణంగా రామకృష్ణకు మాత్రం ఆ శబ్దం వినపడలేదు. అదే సమయంలో సహచరులు కేకలు వేసినా ఫలితం లేకుండాపోయింది. పట్టాల వద్ద పని చేస్తున్న యువకుడ్ని గూడ్స్ ఢీకొనడంతో... అతను తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన నెల్లూరుకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం ప్రాణాలు విడిచారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.