
పై వంతెన సొబగులు
పునాదులు పడుతున్నాయి. పై వంతెన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. నిర్ణీత గడువులోపు కట్టడాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసేందుకు అధికారులు యత్నిస్తుండగా- ఇప్పటికే గడువు సమయంలో 91 రోజులు కరిగిపోయాయి. నెల్లూరు నగరంలోని రామలింగాపురం కూడలి వద్ద పై వంతెన నిర్మాణ పనుల్లో పరిస్థితి ఇది.
ఈనాడు, నెల్లూరు : తొమ్మిది లక్షల మంది జనాభా ఉన్న జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రద్దీ క్రమేనా పెరుగుతున్నా.. ఆ మేరకు రోడ్లు విస్తరణకు నోచుకోకపోవడంతో ఇబ్బంది నెలకొంది. ఈ స్థితిలో కొన్ని ప్రధాన కూడళ్లు, ప్రాంతాల్లో పై వంతెన నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టారు. ఎన్హెచ్ఏఐ పరిధిలోని రహదారుల్లో కేంద్రం, ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లపై రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పైవంతెనల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. నగరంలోని రామలింగాపురం కూడలి వద్ద కృష్ణపట్నం పోర్టుకు, ఆత్మకూరు బస్టాండుకు వెళ్లే వాహనాలతో తరచూ రద్దీ ఏర్పడుతున్న క్రమంలో అక్కడ పైవంతెన ఏర్పాటుకు ఏడాది కిందట ప్రతిపాదనలు వెళ్లాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 0.81 కి.మీ. మేర రూ.41.88 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఆ మేరకు నిధులు మంజూరు కావడం, టెండరు ప్రక్రియ పూర్తి చేసి పనులు అప్పగించారు. గత ఏడాది అక్టోబరు 16న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వర్చువల్ విధానంలో ఈ పనులు ప్రారంభించారు. 358 రోజుల వ్యవధిలో ఈ పనులు పూర్తిచేసి నిర్మాణం జాతికి అంకితం చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆ మేరకు పనుల సమీపంలోనే డిజిటల్ తెరనూ ఏర్పాటు చేసి గడువు సమయాన్ని ప్రదర్శిస్తున్నారు.
మళ్లింపు లేకపోవడం...
ఈ పైవంతెన నిర్మాణ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతుండగా- ఇప్పటికే మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు.. వంతెన పునాదుల ఏర్పాటుకు భారీ గుంతలు తవ్వుతున్నారు. కొన్నిచోట్ల గుంతల్లో కాంక్రీట్ స్తంభాల నిర్మాణమూ మొదలైంది. ఇప్పటికి 91 రోజుల సమయం పూర్తికాగా.. మరో 267 రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్లు డిజిటల్ తెర స్పష్టం చేస్తోంది. ఈ స్థితిలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతుండగా.. ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. నిర్వహణ సరిలేకపోవడం, పోలీసులు మిన్నకుండిపోతుండటం తదితరాలతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లింపు లేకపోవడం మరో సమస్యగా మారింది. పనులు మరో తొమ్మిది నెలల పాటు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
మరో మూడు..