Updated : 20/01/2021 05:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ బాధలు పడలేకనే...

జీజీహెచ్‌లో ఎంఎన్‌వో ఆత్మహత్యాయత్నం ●

జీతాల చెల్లింపులో జాప్యంతోనే అని వెల్లడి


ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలతో చర్చిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే: కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబాలకు దూరంగా ఉండి సేవలు అందిస్తే జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారని, ఫలితంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ మామిడి ప్రేమ్‌కుమార్‌(40) అనే ఒప్పంద ఎంఎన్‌వో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన మంగళవారం ఉదయానికి వెలుగులోకి వచ్చింది. బాధితుడిని వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జరిగిన సంఘటనతో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 250 మంది వరకు ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలను పొరుగు సేవల విధానంలో ప్రభుత్వం జీజీహెచ్‌లో కొవిడ్‌ విధులకు తీసుకుంది. వీరు ఆరు నెలలుగా పని చేస్తున్నా.. చిల్లిగవ్వ కూడా అందలేదు. పలుమార్లు ఉన్నతాధికారులను సైతం అభ్యర్థించినా ప్రయోజనం చేకూరలేదు. ఉద్యోగులు ఆ ఆవేదనలో ఉండగానే ప్రేమ్‌కుమార్‌ సంఘటన చోటు చేసుకుంది. కొవిడ్‌ సమయంలో ఎంతగానో పనిచేశాం. ఆరు నెలలుగా జీతాలు లేవు. ఇంటి అద్దెలు కట్టుకునేందుకూ, కనీస ఖర్చులకూ డబ్బు లేదు. ఆ బాధలు భరించలేకనే ఆత్మహత్యకు యత్నించానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తెదేపా నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అజీజ్‌ బాధితుడిని పరామర్శించారు.జీజీహెచ్‌లో బైఠాయించి నిరసన తెలిపారు.

సంఘటన బాధాకరం : కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఎమ్మెల్యే

ఎంఎన్‌వో ప్రేమ్‌కుమార్‌ సంఘటన బాధాకరం. ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలకు త్వరితంగా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటా. కరోనా సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ సేవలు మరువలేనివని. వారి సేవలను కచ్చితంగా గుర్తించాల్సిందే. ఇప్పటికే ట్రెజరీకి సంబంధించిన సమస్యలు పూర్తయ్యాయి. వారి ఉద్యోగ భద్రత విషయంలోనూ నా వంతు ప్రయత్నం చేస్తా.

ఒప్పందాన్ని కొనసాగించాలి : అబ్దుల్‌ అజీజ్‌, తెదేపా నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు

ఒప్పందం గడువు ముగిసినా ఆరు నెలలుగా ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలకు జీతాలు ఇవ్వకపోవడం దారుణం. వాటిని వెంటనే చెల్లించడంతో పాటు వారి కాంట్రాక్ట్‌ గడువు పొడిగించాలి. గతంలో ఎన్‌ఏబీహెచ్‌ ఆడిట్‌లో ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలు లేరని రాశారు. దాని ప్రకారం వీరందరినీ శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలి.

మా వద్ద పెండింగ్‌ లేదు.. : డాక్టర్‌ శ్రీనివాసన్‌, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌

ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోల జీతాలకు సంబంధించిన బిల్లులను పూర్తి చేసి ఖజానాకు పంపాం. మా వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవు. ఖజానాలోనూ పూర్తయ్యాయి. ఆర్‌బీఐ నుంచి నిధులు విడుదలయితే జీతాలు సిబ్బంది ఖాతాల్లో జమవుతాయి.

బాధితుడిని పరామర్శిస్తున్న అజీజ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని