
తాగునీటికి విద్యుత్తు సరఫరా ఇవ్వండి
నెల్లూరు (విద్యుత్తు ) న్యూస్టుడే : జిల్లాలో నివర్ తుపానుతో విద్యుత్తు సరఫరా లేని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యమివ్వాలని విద్యుత్తు చీఫ్ జనరల్ మేనేజర్ సుబ్బరాజు ఆదేశించారు. తుపాను, పెన్నా వరదలతో విద్యుత్తు శాఖకు నష్టం వాటిల్లిన ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన శనివారం నెల్లూరు నగరంలోని విద్యుత్తు భవన్లో ఎస్ఈ విజయకుమార్రెడ్డితో సమావేశమయ్యారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తక్షణం తాగునీటి సరఫరాకు మోటార్లకు విద్యుత్తు సరఫరా అందజేయాలని సూచించారు. ఇప్పటికే రూ.3 కోట్లపైనే నష్టం కలిగిందని, విద్యుత్తు సరఫరా లేని ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అన్ని డివిజన్ల ఇంజినీర్లను ఆదేశించారు. తిరుపతిలోనూ శనివారం సీఎండీ హరనాథరావు నెల్లూరు అధికారులతో మాట్లాడుతూ విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు త్వరగా చేపట్టాలన్నారు.