
సోమశిల @ 32ఏళ్లు
అంతర్రాష్ట్ర స్థాయి సేవలకు వేదిక
ఆత్మకూరు, న్యూస్టుడే: సోమశిల జలాశయాన్ని జాతికి పునరంకితం చేసి గురువారంతో 32 ఏళ్లు పూర్తయింది. 1988 నవంబర్ 26న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారు. 1951లో కృష్ణా పెన్నారుల పథకం ప్రతిపాదించారు. ఇందులో భాగంగా సోమశిల వద్ద పెన్నా నదిపై జలాశయం నిర్మించాలని నిర్ణయించారు. 1968లో ఏర్పడిన అంతర్రాష్ట్ర జల వివాదంతో సోమశిల ప్రాజెక్టు పెన్నా నది నీటికే మొదట పరిమితమైంది. మూడేళ్ల తరువాత రూ.33.52 కోట్లతో జలాశయం నిర్మాణానికి సిద్ధం చేశారు. 1973 నవంబర్లో రూ.17.2 కోట్లతో మొదటి దశ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1975లో శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఈ ప్రాజెక్టు స్వరూపమే మారిపోయింది. తెలుగుగంగ పథకం రూపకల్పనతో జలాశయం అంతర్రాష్ట్ర స్థాయిని సంతరించుకుంది.
నిర్మాణం.. ప్రయోగాత్మకం.. సోమశిల వద్ద నదీగర్భంలో 200 అడుగుల వరకు రాతి పొర లేదు. అందుకోసం మట్టికట్ట నిర్మించాలని తలపెట్టారు. రెండడుగుల మందం కలిగిన ప్లాస్టిక్ డయాప్రం గోడలను రెండొందల అడుగు లోతు నుంచి నిర్మించుకొచ్చారు. రెండు గోడల మధ్య సిమెంటు, ఇతర రసాయనాలతో గ్రౌటింగ్ చేశారు. 1,155 అడుగుల పొడవైన మట్టికట్ట, 1,455 అడుగుల పొడవైన కాంక్రీట్ వినియోగించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల తాగునీటి అవసరాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చే వరదాయినిగా సోమశిల మారింది.